పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ స్లో అవుతుందనే సెంటిమెంట్‌ను కీర్తి సురేష్ బ్రేక్ చేసింది. అంతేకాదు, ఇన్నాళ్లు మనసులో దాచుకున్న ఓ పెద్ద సీక్రెట్ బయటపెట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది!
సాధారణంగా పెళ్లి కాగానే హీరోయిన్లు సినిమాలకు కాస్త దూరమవుతారు, లేదా వేగం తగ్గిస్తారు. కానీ కీర్తి సురేష్ మాత్రం 'రివాల్వర్ రీటా' ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంటూ ఆ సెంటిమెంట్‌కు చెక్ పెట్టింది. నటన మాత్రమే కాదు, ఇప్పుడు సినిమాల మేకింగ్‌పై కూడా తన ఫోకస్ మళ్లింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో "నేను సొంతంగా ఒక స్క్రిప్ట్ రాస్తున్నా" అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంటే కీర్తి త్వరలోనే మెగాఫోన్ పట్టి డైరెక్టర్ సీట్లో కూర్చోవడానికి సిద్ధమవుతోందని ఫిలింనగర్‌లో చర్చ మొదలైంది.
సావిత్రి బాటలోనే 'మహానటి'?
నటిస్తూనే దర్శకత్వం చేయడం అంత సులువైన విషయం కాదు. అజయ్ దేవగన్, కంగనా రనౌత్ వంటి కొద్దిమంది మాత్రమే ఈ ఫీట్ సాధించారు. ఇప్పుడు కీర్తి కూడా ఆ లిస్టులో చేరేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తోంది. 'మహానటి' సినిమాలో సావిత్రిగా మెప్పించిన కీర్తి, నిజ జీవితంలో కూడా సావిత్రి గారి లాగే దర్శకత్వం వైపు అడుగులు వేస్తుండటం యాదృచ్ఛికమే అయినా చాలా ఆసక్తికరంగా మారింది.
భర్తతో నటించే ఛాన్స్ ఉందా?
ఇక తన వ్యక్తిగత విషయాలపై కూడా కీర్తి క్లారిటీ ఇచ్చింది. తన భర్త ఆంటోనీ తటిల్‌తో కలిసి నటించే అవకాశం ఉందా అని అడగ్గా.. "నా భర్త సినిమాల జోలికి అస్సలు రారు, నాతో నటించే ఛాన్స్ లేదు" అని నవ్వుతూ కొట్టిపారేసింది. భర్త సపోర్ట్ ఉన్నా, తన కెరీర్‌ను తనే స్వయంగా డిజైన్ చేసుకోవాలనే ఆత్మవిశ్వాసం ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ వీడియో చూసి భయపడ్డా!
మరోవైపు, టెక్నాలజీ తెస్తున్న ముప్పుపై కూడా కీర్తి ఆందోళన వ్యక్తం చేసింది. తనకూ, సమంతకూ సంబంధించిన ఒక డీప్‌ఫేక్ (Deepfake) వీడియో చూసి తాను ఎంతగా భయపడిపోయానో వివరించింది. మహిళల భద్రతకు విదేశాల్లో ఉన్నంత కఠిన చట్టాలు, ఇలాంటి సైబర్ నేరాల విషయంలో మన దేశంలో కూడా రావాలని ఆమె డిమాండ్ చేసింది.

