బుల్లెట్ లవర్స్‌కు పూనకం తెప్పించే న్యూస్ వచ్చేసింది! రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ 'బిగ్ డాడీ' బైక్ ఎట్టకేలకు ఇండియాలో దర్శనమిచ్చింది.
గోవా వేదికగా జరుగుతున్న మోటోవర్స్ ఫెస్టివల్ (Motoverse Festival) బైక్ ప్రియులకు పండగలా మారింది. ఇటలీలో జరిగిన EICMA షోలో అదరగొట్టిన 'రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650' (Royal Enfield Bullet 650) ఇప్పుడు మన దేశంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అధికారికంగా మార్కెట్‌లోకి రావడానికి 2026 ఆరంభం వరకు ఆగాల్సి ఉన్నా, దీని లుక్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. దీని ధర సుమారు ₹3.40 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
బుల్లెట్ 350కి పెద్దన్న.. పవర్ మాత్రం డబుల్!
డిజైన్ పరంగా చూస్తే ఇది బుల్లెట్ 350కి పెద్దన్నలా ఉంది. క్లాసిక్ లుక్‌ను ఏమాత్రం చెడగొట్టకుండానే, ఆధునిక హంగులు జోడించారు. కానన్ బ్లాక్, బాటిల్‌షిప్ బ్లూ అనే రెండు రంగుల్లో ఇది లభించనుంది.
బుల్లెట్ 650 టాప్ ఫీచర్లు ఇవే:
ఇంజిన్: 648cc ట్విన్-సిలిండర్ ఇంజిన్ (47 bhp పవర్, 52.3 Nm టార్క్).
డిజైన్: టైగర్-ఐ పైలట్ ల్యాంప్స్, క్లాసిక్ రౌండ్ LED హెడ్‌లైట్, చేతితో గీసిన పిన్‌స్ట్రిప్స్ (hand-painted pinstripes).
టెక్నాలజీ: USB టైప్-C ఛార్జింగ్, ట్రిప్పర్ నావిగేషన్, సెమీ-డిజిటల్ క్లస్టర్.
సేఫ్టీ: ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, డ్యూయల్ ఛానల్ ABS.
243 కిలోల బరువున్న ఈ భారీ బైక్‌లో 6-స్పీడ్ గేర్ బాక్స్, అడ్జస్టబుల్ బ్రేక్ లివర్లు ఉండటం విశేషం. 14.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో వచ్చే ఈ బైక్, పాత బుల్లెట్ దర్జాను, కొత్త 650cc ఇంజిన్ పవర్‌ను కలగలిపి రోడ్లపై రారాజులా దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.

