కాంగ్రెస్ వద్దన్నా సరే.. ఆ రెండు పార్టీలు కలవాల్సిందేనట! మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కొత్త చిచ్చు రేపుతున్నాయి.
మహారాష్ట్రలో శివసేన (UBT), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) కలవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఉన్నా, తాము అస్సలు పట్టించుకోమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. ఈరోజు (నవంబర్ 22) 'ఎక్స్' వేదికగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రజల కోరిక మేరకే మా రెండు పార్టీలు ఒక్కటయ్యాయని, దీనికి ఢిల్లీ అనుమతి లేదా కాంగ్రెస్ పర్మిషన్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
శరద్ పవార్ కూడా ఓకే..
బీజేపీని ఎదుర్కోవడానికి అందరూ ఏకమవ్వడం మంచిదనే అభిప్రాయంతో శరద్ పవార్ (NCP) కూడా ఉన్నారని సంజయ్ రౌత్ వెల్లడించారు. పరోక్షంగా ఎంఎన్‌ఎస్‌ను కూటమిలో చేర్చుకోవడానికి ఎన్‌సీపీ, వామపక్షాలు సిద్ధంగానే ఉన్నాయని సంకేతాలిచ్చారు. మహా వికాస్ అఘాడి (MVA)లోని సమాజ్‌వాదీ, కమ్యూనిస్ట్, అంబేద్కర్ పార్టీలన్నీ కలిసి పోరాడాలనే యోచనలో ఉన్నాయి.
ఠాక్రే సోదరుల ప్లాన్ అదేనా?
అయితే, ఎంఎన్‌ఎస్‌ను హిందూ భావజాలం ఉన్న పార్టీగా చూస్తూ కాంగ్రెస్ ఈ పొత్తును వ్యతిరేకిస్తోంది. కానీ వచ్చే ఏడాది జరగనున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో తన సోదరుడు రాజ్ ఠాక్రేతో కలిసి పోటీ చేయాలని ఉద్ధవ్ ఠాక్రే పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే ఒంటరి పోరుకు సై అంటున్నా, శివసేన మాత్రం ఎంఎన్‌ఎస్‌తో దోస్తీకే మొగ్గు చూపుతుండటం ప్రతిపక్ష కూటమిలో కొత్త అలజడి సృష్టిస్తోంది.

