తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీల మధ్య నడిచిన యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. "మాటల్లేవ్" అని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పడం, "తగ్గేదేలే" అని యాజమాన్యాలు సమ్మెకు దిగడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, అనూహ్యంగా జరిగిన చర్చలు ఫలించి, వివాదానికి ఎండ్‌కార్డ్ పడింది.
చర్చలకు ముందు.. హైడ్రామా, సీఎం వార్నింగ్!
ప్రభుత్వంతో చర్చలకు ముందు రాష్ట్రంలో పెద్ద హైడ్రామా నడిచింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. "విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించబోం. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదు, తమాషాలు చేస్తే తాట తీస్తాం" అని యాజమాన్యాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
కాలేజీల పట్టు.. ఆర్. కృష్ణయ్య ఎంట్రీ
మరోవైపు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా ఏమాత్రం తగ్గలేదు. మొత్తం బకాయిల్లో తక్షణమే 50 శాతం చెల్లించేదాకా ఆందోళనలు విరమించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పాయి. ఇదే సమయంలో బీసీ నేత ఆర్ కృష్ణయ్య.. ప్రభుత్వ వైఫల్యం వల్లే బంద్ అని, తాను ఇరువర్గాల మధ్య చర్చలు జరుపుతానని ముందుకొచ్చారు.
రంగంలోకి దిగి.. రాజీ కుదిర్చిన భట్టి!
ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల నడుమ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యాజమాన్యాలతో నేరుగా చర్చలు జరిపారు. ఈ చర్చలు అనూహ్యంగా ఫలించాయి. మొత్తం రూ. 1,500 కోట్ల బకాయిలకు గాను, ఇప్పటికే రూ. 600 కోట్లు విడుదల చేశామని, మరో రూ. 600 కోట్లు వెంటనే రిలీజ్ చేస్తామని భట్టి హామీ ఇచ్చారు.
శనివారం నుంచి కాలేజీలు ఓపెన్
మిగిలిన రూ. 300 కోట్లను కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో, కాలేజీల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. సమ్మె విరమించి, కాలేజీలు తెరిచేందుకు అంగీకరించాయి.
ప్రభుత్వంతో రాజీ కుదరడంతో, ఐదు రోజులుగా మూతపడిన ప్రైవేట్ కాలేజీల గేట్లు శనివారం (నవంబర్ 8) నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

