తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
14.8°C.. ఆదిలాబాద్‌లో అతితక్కువ ఉష్ణోగ్రత
రాష్ట్రంలో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేలలో అతితక్కువగా 14.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రతకు ఇది అద్దం పడుతోంది.
హైదరాబాద్‌ను వణికిస్తున్న చలి
నగరంలోనూ చలి వణికిస్తోంది. హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ ప్రాంతంలో 17.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 18.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్లే చలి ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. రాత్రిపూట ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.
9న మరింత తగ్గే అవకాశం!
ప్రస్తుతం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల మధ్య, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అయితే, ఈ నెల 9వ తేదీన ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది.
రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
