అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వడానికే H-1B వీసాలట! ఆ ట్రైనింగ్ అవ్వగానే.. ఇక మీరు వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సిందే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో ఇమిగ్రేషన్, ప్రత్యేకంగా హెచ్-1బీ వీసా విధానంపై మార్పులు వేగంగా జరుగుతున్నాయి. విదేశీ నైపుణ్యాలపై ఎక్కువకాలం ఆధారపడకుండా, అమెరికా కార్మికులను కీలక రంగాల్లో శిక్షణతో ముందుకు తేవాలనే ఉద్దేశంతో ఈ మార్పులను ప్రభుత్వం అమలు చేస్తోంది.
"ట్రైనింగ్ ఇచ్చి, వెనక్కి వెళ్లాలి": అమెరికా మంత్రి
ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. హెచ్-1బీ వీసా కొత్త విధానం ప్రధానంగా "నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్" (జ్ఞాన బదిలీ) కోసం రూపొందించబడిందని ఆయన అన్నారు.
"అమెరికన్లకు శిక్షణ ఇవ్వడానికి విదేశీ కార్మికులను తాత్కాలికంగా తీసుకురావడం మా లక్ష్యం. శిక్షణ ఇచ్చిన తర్వాత వారు తిరిగి వెళ్ళిపోవాలి. చివరికి ఉద్యోగాలు అమెరికన్లదే" అని స్కాట్ బెసెంట్ స్పష్టంగా కామెంట్ చేశారు.
కీలక రంగాల్లో నైపుణ్యాల కొరత
అమెరికాలోని కీలక రంగాలు, ముఖ్యంగా సెమీకండక్టర్ తయారీ, రక్షణ ఉత్పత్తులు, అధునాతన తయారీ రంగం వంటి విభాగాలు తీవ్ర నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆరిజోనా వంటి రాష్ట్రాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేయాలంటే, అమెరికా ఉద్యోగులకు అనుభవజ్ఞులైన విదేశీ కార్మికుల నుంచి శిక్షణ అవసరమని ఆయన వివరించారు.
ఇది "తాత్కాలిక" సర్దుబాటే!
హెచ్-1బీ వీసాపై కఠినతరం చేసిన నిబంధనలు అమెరికన్ల ఉద్యోగ రక్షణకే అని ప్రభుత్వం చెబుతోంది. స్కాట్ బెసెంట్ ప్రకారం, అమెరికా దీర్ఘకాలికంగా విదేశీ పనిజనశక్తిపై ఆధారపడకూడదు. నైపుణ్యాల బదిలీ కోసం తాత్కాలికంగా మాత్రమే విదేశీ ఉద్యోగులను రప్పిస్తారు. దేశీయ కార్మికులు అవసరమైన నైపుణ్యాలు పొందిన తర్వాత, విదేశీ కార్మికుల అవసరం తగ్గిపోతుంది.
వీసాలు ఆపం.. కానీ వడపోత ఉంటుంది!
అయితే, హోమ్‌లాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టి నోయమ్ వీసా వ్యవస్థపై కొంత స్పష్టతనిచ్చారు. “అమెరికాకు వచ్చే వ్యక్తులు ఉగ్రవాదులకు మద్దతుదారులు కాదని నిర్ధారించుకునే ప్రక్రియ కొనసాగుతుంది. వీసా కార్యక్రమాలు పూర్తిగా నిలిపివేయబోవడం లేదని" ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ట్రంప్ కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు విదేశీ ప్రతిభ అవసరమని అంగీకరించారు.
భారతీయులపై తీవ్ర ప్రభావం!
హెచ్-1బీ వీసా వ్యవస్థను అమెరికా ప్రభుత్వం ఇకపై శాశ్వత వలస మార్గంగా కాకుండా, ఒక 'తాత్కాలిక నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్' కార్యక్రమంగా మలుస్తోంది. విదేశీ నైపుణ్యంతో అమెరికా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, ఆ తర్వాత కీలక ఉద్యోగాలను పూర్తిగా అమెరికన్లతో భర్తీ చేయడం ట్రంప్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ విధానం భారతీయ ఐటీ ఉద్యోగులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

