ఒకప్పుడు అమెరికా కల.. ఇప్పుడు భారతీయులు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఆ ఒక్క కారణం వారి భవిష్యత్తునే మార్చేస్తోంది!
అమెరికా చదువులకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా తగ్గుతోంది! ముఖ్యంగా 2024-25 విద్యా సంవత్సరంలో, మాస్టర్స్, పీహెచ్‌డీ వంటి గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కొత్త ప్రవేశాలు ఏకంగా 10 శాతం మేర పడిపోయినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ నిధులతో రూపొందించిన తాజా నివేదిక ఒకటి బయటపెట్టింది.
17% తగ్గిన అంతర్జాతీయ ప్రవేశాలు
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (IIE) సోమవారం విడుదల చేసిన "ఓపెన్ డోర్స్" నివేదిక ప్రకారం, 2025 ఫాల్ సెషన్‌లో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలు ఏకంగా 17 శాతం తగ్గాయి. సర్వేలో పాల్గొన్న 825 అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో, 61 శాతానికి పైగా సంస్థలు ప్రత్యేకంగా భారత విద్యార్థుల నమోదులో క్షీణత కనిపించిందని అంగీకరించాయి.
వీసా తిరస్కరణలే అసలు కారణం!
ఈ భారీ తగ్గుదలకు గల కారణాలను కూడా యూనివర్సిటీలు వెల్లడించాయి. 96 శాతం యూనివర్సిటీలు వీసా దరఖాస్తుల విషయంలో ఎదురవుతున్న సమస్యలు, కఠినమైన ప్రయాణ ఆంక్షలే ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని అభిప్రాయపడ్డాయి.
అయితే, మొత్తం విద్యార్థుల సంఖ్య (పాతవారు + కొత్తవారు) పరంగా చూస్తే, అమెరికాకు అత్యధిక విదేశీ విద్యార్థులను పంపిన దేశంగా భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. కానీ కొత్తగా గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరికలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.
ట్రంప్ కఠిన విధానాలు.. H-1Bపై ఉక్కుపాదం!
ఇటీవలి కాలంలో ట్రంప్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులపై నిఘా పెంచడం, H-1B వీసాల దుర్వినియోగంపై 170కి పైగా విచారణలు ప్రారంభించడం వంటి చర్యలు ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తున్నాయి. కొత్తగా H-1B దరఖాస్తులకు లక్ష డాలర్ల ఫీజును ప్రతిపాదించడాన్ని వైట్ హౌస్ సమర్థించింది. ఈ విధానం ద్వారా అమెరికన్ల ఉద్యోగాలను కాపాడగలమని వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు.
మరోవైపు, రిపబ్లికన్ చట్టసభ సభ్యులు హెచ్-1బీ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనికి తోడు, జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను స్టేట్ డిపార్ట్‌మెంట్ రద్దు చేయడం భయాందోళనలను రెట్టింపు చేసింది.
ఆర్థిక వ్యవస్థకు 55 బిలియన్ డాలర్ల నష్టం!
ఈ తాజా పరిణామాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం, అంతర్జాతీయ విద్యార్థులు ఏటా దాదాపు 55 బిలియన్ డాలర్లను దేశ ఆర్థిక వ్యవస్థకు అందిస్తూ, 3.55 లక్షల ఉద్యోగాలకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఒకవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయ విద్యార్థులు కీలకంగా ఉన్నప్పటికీ, మరోవైపు ట్రంప్ ప్రభుత్వ కఠినమైన వీసా నిబంధనలు, రాజకీయ ఒత్తిళ్లు.. భారతీయ విద్యార్థులను అమెరికా ఉన్నత విద్యకు దూరం చేస్తున్నాయి.

