ధరల దెబ్బకు ట్రంప్ సర్కార్ దిగొచ్చింది! అమెరికన్ల కోపం తగ్గించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం.. ఇప్పుడు మన మామిడి రైతులకు బంపర్ ఆఫర్‌గా మారింది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్, దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు, రాజకీయంగా పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఆహార ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను భారీగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం భారత్ నుంచి ఎగుమతి అయ్యే మామిడి, దానిమ్మ, టీ వంటి వ్యవసాయ ఉత్పత్తులకు గొప్ప ప్రయోజనం చేకూర్చనుంది.
ఎన్నికల దెబ్బ.. తగ్గిన సుంకాలు!
శుక్రవారం వైట్‌హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్ ప్రకారం.. ట్రాపికల్ పండ్లు, పండ్ల రసాలు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, కోకో, నారింజ, టమోటాలు, బీఫ్ వంటివాటిపై విధించిన సుంకాలను తొలగించారు. గతంలో భారత్‌తో సహా ఇతర దేశాలపై ట్రంప్ 25% సుంకాలు, దానికి తోడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా మరో 25% భారం మోపిన సంగతి తెలిసిందే. ఈ సుంకాల వల్లే అమెరికాలో ఆహార ధరలు ఆకాశాన్నంటాయి.
ఇటీవల న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియాలో జరిగిన ఎన్నికల్లో "ధరల భారం" అంశాన్నే డెమొక్రాట్లు బలంగా ప్రచారం చేసి విజయాలు సాధించారు. ధరల నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ విషయంలో ట్రంప్ విఫలమయ్యారని 63% మంది ఓటర్లు అభిప్రాయపడినట్లు ఎన్‌బీసీ న్యూస్ పోల్ చెప్పడంతో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
'మ్యాంగో డిప్లమసీ'.. మళ్లీ తెరపైకి!
అయితే, ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు. ఇది డెమొక్రాట్లు చేస్తున్న 'కంప్లీట్ కాన్ జాబ్' (పూర్తి మోసం) అని, బైడెన్ హయాంలో ద్రవ్యోల్బణం 19.7%కి చేరిందని విమర్శించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 3% వద్ద ఉన్నా, ఆహార ధరలు తగ్గకపోవడం ట్రంప్‌కు రాజకీయంగా తలనొప్పిగా మారింది.
భారత్-అమెరికా సంబంధాల్లో మామిడి పండ్లకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. 2006లో మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మామిడిపై నిషేధాన్ని ఎత్తివేయగా, ఇటీవలే ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రంప్, మోదీల సంయుక్త ప్రకటనలో కూడా మామిడి, దానిమ్మ ఎగుమతుల ప్రస్తావన వచ్చింది.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు గతంలో జనరిక్ ఔషధాలకు మినహాయింపు ఇచ్చిన ట్రంప్ సర్కార్, ఇప్పుడు ఎన్నికల ఒత్తిడి, రాజకీయ అవసరాల రీత్యా ఆహార ఉత్పత్తులకు కూడా ఊరట కల్పించింది. ఈ నిర్ణయం అమెరికన్లకు ధరల భారం తగ్గించడమే కాకుండా, భారతీయ రైతులకు కొత్త ఎగుమతి అవకాశాలను తెరిచింది.

