జక్కన్నపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి! క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆపేస్తాం అంటూ విశ్వహిందూ పరిషత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
క్షమాపణ చెప్పకుంటే సినిమాలు ఆపేస్తాం
హనుమంతుడిపై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, కచ్చితంగా ఆయన సినిమాలను అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్ (VHP) హెచ్చరించింది. వీహెచ్‌పీ తెలుగు రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సినిమా క్లిప్స్ రిలీజ్ కాకపోవడానికి, హనుమంతుడికి సంబంధం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. దైవాన్ని అపహాస్యం చేసేలా సినిమాలు తీసినా, వ్యాఖ్యలు చేసినా హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.
"తండ్రిని కూడా బాధించేలా.."
రాజమౌళి వ్యాఖ్యలు కేవలం హిందూ సమాజాన్నే కాకుండా, ఆయన తండ్రి (విజయేంద్ర ప్రసాద్) మనోభావాలను కూడా కించపరిచేలా ఉన్నాయని రవికుమార్ మండిపడ్డారు. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించడం లేదా అని ప్రశ్నిస్తూ, రాజమౌళి హిందూ సమాజం ముందు గల్లీ స్థాయి వ్యక్తిగా దిగజారిపోయారని విమర్శించారు. కాసుల గర్వంతో, మదంతో మాట్లాడటం సరికాదని, అంజనేయ స్వామిని నిందించడం ఒక ఫ్యాషన్‌గా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ధర్మ ద్రోహమేనని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

