ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లతో విసిగిపోయారా? ఏపీ ప్రభుత్వం పర్యావరణం కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నగరాల్లో ప్లాస్టిక్ వాడకంపై ఉక్కుపాదం మోపడానికి డేట్ ఫిక్స్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'స్వచ్ఛాంధ్ర'లో భాగంగా కీలక ప్రకటన చేసింది. 2026 అక్టోబర్ 2 నుంచి (వచ్చే ఏడాది గాంధీ జయంతి) రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్' (Single Use Plastic)ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.
96 పట్టణాల్లో ప్లాస్టిక్ బంద్!
కలెక్టర్ల సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.
విస్తరణ: ఇప్పటికే 17 మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉండగా.. మిగిలిన 96 పట్టణాల్లోనూ దీనిని విస్తరించనున్నారు.
ఏమేం పోతాయి?: ఈ నిర్ణయంతో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు వంటి ఒకసారి వాడి పడేసే వస్తువుల వినియోగం పూర్తిగా ఆగిపోనుంది. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
స్వచ్ఛాంధ్ర.. అవార్డులన్నీ మనకే రావాలి!
సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాబోయే మూడన్నరేళ్లలో వ్యర్థాల నిర్వహణను (Waste Management) సున్నా స్థాయికి తీసుకురావాలన్నారు.
టార్గెట్: కేంద్రం ఇచ్చే స్వచ్ఛత అవార్డులన్నీ ఏపీకే దక్కేలా పని చేయాలి.
డ్రైనేజీలు: నగరాల్లో ఆక్రమణలు లేకుండా చూసుకోవాలి. భారీ వర్షాలు వస్తే ముంపు సమస్య రాకుండా కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి కలెక్టర్ ఒక పట్టణంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి.
తిరుమల 100% పచ్చదనం.. పవన్‌కు సూచన
రాజధాని అమరావతి, కలియుగ దైవం కొలువైన తిరుమలను జీవవైవిధ్య (Biodiversity) కేంద్రాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు.
తిరుమల: ప్రస్తుతం 89% ఉన్న పచ్చదనాన్ని 100 శాతానికి పెంచాలి. ప్రపంచంలోనే బెస్ట్ బయోడైవర్సిటీ ప్రాంతంగా తిరుమలను తీర్చిదిద్దాలి.
పవన్‌కు సూచన: హైదరాబాద్‌లోని రామచంద్ర మిషన్‌లో అంతరించిపోతున్న మొక్కలను కాపాడే విధానాన్ని (టిష్యూ కల్చర్) ఒకసారి పరిశీలించమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు సూచించారు.
రేపే 'ముస్తాబు'
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఈ నెల 20న (రేపు) 'ముస్తాబు' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.

