మనం చాట్‌జీపీటీతో (ChatGPT) సరదాగా మాట్లాడే ప్రతిసారీ పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఏఐకి కరెంట్ మాత్రమే కాదు.. విపరీతమైన దాహం కూడా ఉంటుందట. అవును, మీరు విన్నది నిజమే.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం వెనుక మనం గుర్తించని ఒక పెద్ద ముప్పు పొంచి ఉంది. ఇప్పటివరకు ఏఐ అంటే కేవలం విద్యుత్ వినియోగం మాత్రమే అనుకున్నాం. కానీ గూగుల్ జెమినీ, చాట్‌జీపీటీ వంటి ఏఐ వ్యవస్థలను నడిపించే 'డేటా సెంటర్లు' (Data Centers) భారీగా మంచినీటిని తాగేస్తున్నాయి. ఇప్పటికే వర్షాభావంతో, నీటి ఎద్దడితో సతమతమవుతున్న భారత్ వంటి దేశాలకు ఇది భవిష్యత్తులో పెను ప్రమాదంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏఐకి నీరు ఎందుకు?
ఏఐ మోడల్స్ పనిచేయాలంటే తెర వెనుక భారీ వ్యవస్థ అవసరం.
వేడెక్కే సర్వర్లు: ఏఐ కోసం వేలాది సర్వర్లు 24 గంటలూ పనిచేయాల్సి ఉంటుంది. ఇవి చాలా త్వరగా, తీవ్రంగా వేడెక్కుతాయి.
కూలింగ్ సిస్టమ్స్: ఈ సర్వర్లను చల్లబరచడానికి (Cooling) నిరంతరం నీరు అవసరం. ప్రస్తుతం వాడుతున్న విధానాల్లో.. ఈ నీరు ఆవిరైపోతుంది లేదా రసాయనాలతో కలిసిపోయి మళ్లీ వాడటానికి పనికిరాకుండా పోతుంది.
100 పదాలకు ఒక బాటిల్ నీరు!
పరిశోధకులు చెబుతున్న లెక్కలు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
నీటి వినియోగం: ఏఐ ప్రాంప్ట్‌లో మనం టైప్ చేసే ప్రతి 100 పదాలకు.. సుమారు ఒక బాటిల్ నీరు ఖర్చవుతుందట.
అమెరికా లెక్కలు: 2023లో కేవలం అమెరికాలోని డేటా సెంటర్లే ఏకంగా 66 బిలియన్ లీటర్ల నీటిని వాడేశాయి.
ప్రమాద ఘంటికలు: ప్రపంచవ్యాప్తంగా 45 శాతం డేటా సెంటర్లు ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయి.
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు
ఏఐ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ నీటి సమస్య జఠిలమవుతోంది. ఆసియా, అమెరికా, ఐరోపాలో కరువు ఉన్న ప్రాంతాల్లోనే పెద్ద పెద్ద డేటా సెంటర్లు కడుతున్నారు.
భారత్‌లో: మన దేశంలో ఇప్పటికే నీటి ఎద్దడి ఉంది. చైనా, స్పెయిన్, జర్మనీలతో పాటు భారత్‌లోనూ నీటి లభ్యత తక్కువగా ఉన్నా.. డేటా సెంటర్ల సామర్థ్యం మాత్రం పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో తాగునీటికే ముప్పు తెచ్చేలా ఉంది.
పారదర్శకత నిల్: ఏఐ కంపెనీలు తాము ఎంత నీటిని వాడుతున్నాయో బయటపెట్టడం లేదు. దీనిపై ఎలాంటి అంతర్జాతీయ నిబంధనలు లేకపోవడం వల్ల ప్రభుత్వాలు, ప్రజలు రాబోయే ప్రమాదాన్ని అంచనా వేయలేకపోతున్నారు.
కేవలం టెక్నాలజీ ఎంత తెలివైనదో చూస్తే సరిపోదు.. అది ఎంత సుస్థిరమైనదో (Sustainable) కూడా చూడాలి. నీటిని పొదుపు చేసే టెక్నాలజీని వాడటం, నీటి లభ్యత ఉన్న చోట మాత్రమే సెంటర్లు కట్టడం తక్షణ అవసరం. లేదంటే ఏఐ.. మన దాహాన్ని తీర్చకపోగా, ఉన్న నీటిని ఆవిరి చేసేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

