మార్కెట్ పడుతున్నా ఆ షేరు మాత్రం తగ్గడం లేదు. స్టాక్ మార్కెట్ రక్తమోడుతున్నా.. ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. అదే ఈ కామర్స్ దిగ్గజం 'మీషో'. లిస్టింగ్ అయిన వారం రోజుల్లోనే ఈ స్టాక్ డబుల్ ధమాకా సృష్టించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. వరుసగా మూడు సెషన్ల నుంచి సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 150 పాయింట్లు పతనమై 84,400 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు తగ్గి 25,800 దిగువన ట్రేడవుతున్నాయి. కానీ, ఈ నష్టాల నడుమ కూడా 'మీషో లిమిటెడ్' (Meesho Limited) షేరు మాత్రం రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది.
వారం రోజుల్లోనే 130% రిటర్న్స్!
మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా మీషో షేరు అప్పర్ సర్క్యూట్లతో అదరగొడుతోంది.
ఆల్ టైమ్ రికార్డ్: గురువారం ఒక్కరోజే ఈ స్టాక్ ఏకంగా 16 శాతానికి పైగా లాభపడింది. ఇంట్రాడేలో రూ. 254.40 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది.
వారంలోనే డబుల్: డిసెంబర్ 10న ఎక్స్చేంజీల్లో అడుగుపెట్టిన మీషో.. కేవలం 7 ట్రేడింగ్ రోజుల్లోనే 130 శాతం లాభాలను అందించింది.
రూ. 111 నుంచి రూ. 254కు..
మీషో ఐపీఓ ప్రస్థానం అద్భుతంగా సాగింది. రూ. 111 ఇష్యూ ధరతో వచ్చిన ఈ షేరు, 46 శాతం ప్రీమియంతో రూ. 162.50 వద్ద లిస్ట్ అయ్యింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా పెరుగుతూనే ఉంది.
ఐపీఓ వివరాలు: 2025 డిసెంబర్ 3-5 మధ్య వచ్చిన ఈ ఐపీఓకు 79 రెట్ల భారీ స్పందన లభించింది.
మార్కెట్ విలువ: కంపెనీ షేరు ధర పెరగడంతో మార్కెట్ క్యాప్ కూడా లక్ష కోట్లు దాటేసింది. ప్రస్తుతం ఇది రూ. 1.05 లక్షల కోట్లుగా ఉంది.
పలు బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్ రేటింగ్‌ను, టార్గెట్ ప్రైస్‌ను పెంచడంతో ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. మార్కెట్ నష్టాల్లో ఉన్నా మీషో మాత్రం లాభాల పంట పండిస్తోంది.

