రిటైర్మెంట్ దగ్గరపడుతుందనగా కొందరు న్యాయమూర్తులు చేస్తున్న పనులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణకు ముందు జడ్జీలు "సిక్స్‌లు కొడుతున్నారు" అంటూ ఘాటుగా స్పందించారు. న్యాయవ్యవస్థలో పెరుగుతున్న అవినీతి ధోరణిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా జడ్జి సస్పెన్షన్ వ్యవహారంపై గురువారం విచారణ చేపట్టిన సందర్భంగా CJI ఈ వ్యాఖ్యలు చేశారు. సదరు జడ్జి తన రిటైర్మెంట్‌కు (నవంబర్ 30) కేవలం పది రోజుల ముందు, అంటే నవంబర్ 19న రెండు వివాదాస్పద తీర్పులు ఇవ్వడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
"రిటైర్మెంట్ ముందు సిక్స్‌లు.."
ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చిల ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
దురదృష్టకరం: "పదవీ విరమణకు ముందు న్యాయమూర్తులు 'సిక్స్‌లు కొట్టడం' (బయటి ప్రయోజనాల కోసం పనిచేయడం) అనేది దురదృష్టకరమైన ధోరణి. దీనిపై నేను ఇంతకంటే ఎక్కువగా వివరించదలుచుకోలేదు" అని CJI అసహనం వ్యక్తం చేశారు.
వయసు పెంపు: రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచిందని, ఆ విషయం తెలియకనే సదరు జడ్జి హడావిడిగా ఆ తీర్పులు ఇచ్చారని కోర్టు అభిప్రాయపడింది.
నిజాయితీ లేకపోతే చర్యలు తప్పవు!
జడ్జి తరఫు న్యాయవాది వాదిస్తూ.. న్యాయపరమైన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానాలు సరిదిద్దవచ్చని, అంతమాత్రాన అధికారిని సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం గట్టిగా బదులిచ్చింది. ఆదేశాలు "స్పష్టంగా నిజాయితీ లేనివిగా" (Patently Dishonest) కనిపిస్తే.. అవి న్యాయపరమైనవే అయినా క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఆర్టీఐ వేస్తారా?
ఈ కేసును విచారించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, ముందుగా హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. అంతేకాకుండా, సస్పెన్షన్ కారణాలు తెలుసుకోవడానికి ఆ జడ్జి ఆర్టీఐ (RTI) దరఖాస్తు చేయడాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. ఒక సీనియర్ జడ్జి అయి ఉండి, వినతిపత్రం ఇవ్వాల్సింది పోయి ఆర్టీఐ వేయడం తగదని హితవు పలికింది.

