బీసీసీఐకి అశ్విన్ కౌంటర్: టి20 ఆడితేనే టెస్టుల్లో ఛాన్సా?

naveen
By -

"టెస్టుల్లో చోటు కావాలంటే రంజీలు ఆడితే సరిపోదు.. ఐపీఎల్‌లో దంచికొట్టాల్సిందేనా?" అశ్విన్ వేసిన ఆ ఒక్క సెటైర్ ఇప్పుడు బీసీసీఐ సెలెక్టర్లకు గట్టిగానే తగిలింది!


Ashwin criticizes BCCI selectors over Abhimanyu Easwaran


టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బీసీసీఐ సెలెక్టర్ల తీరుపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (టి20 టోర్నీ) పంజాబ్‌పై కేవలం 66 బంతుల్లోనే 130 పరుగులు బాది సంచలనం సృష్టించాడు. దీనిని ప్రస్తావిస్తూ, "అబ్బో.. మనవాడు ఇప్పుడు టి20లో కూడా సెంచరీ కొట్టాడు. ఇక కచ్చితంగా మనకు టెస్టుల్లో కనిపిస్తాడులే" అంటూ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఘాటు సెటైర్ వేశారు


రంజీ రికార్డులు వేస్ట్.. టి20 ఫామే బెస్ట్?

దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్నా, కేవలం వైట్-బాల్ (టి20/వన్డే) ఫామ్ ఆధారంగానే టెస్టులకు ఎంపిక చేస్తున్నారన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్ క్లాస్ రికార్డు చూస్తే ఎవరికైనా మతిపోతుంది:

  • ఇప్పటివరకు ఏకంగా 107 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.
  • 48.32 సగటుతో 8,070 పరుగులు సాధించాడు.
  • తన ఖాతాలో 27 సెంచరీలు ఉన్నాయి.

ఇన్నేళ్లుగా రంజీల్లో నిలకడగా రాణిస్తున్నా టెస్ట్ పిలుపు రాలేదు. కానీ, ఇప్పుడు టి20లో సెంచరీ కొట్టగానే అశ్విన్ ఇలా స్పందించడం.. సెలెక్టర్ల ఎంపిక విధానంలోని డొల్లతనాన్ని ఎండగట్టినట్లయింది.


దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత..

ఇటీవల సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 2-0తో టెస్ట్ సిరీస్ వైట్‌వాష్ అవ్వడంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ వంటి తక్కువ రెడ్-బాల్ అనుభవం ఉన్నవారిని ఎంపిక చేయడంపై చర్చ జరుగుతున్న వేళ, అశ్విన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, ఇదే మ్యాచ్‌లో పంజాబ్ తరఫున అభిషేక్ శర్మ కూడా 52 బంతుల్లో 148 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.


Tags: