ఐఏఎస్ కుర్చీలో ఐపీఎస్ అధికారి కూర్చుంటే పాలన సజావుగా సాగుతుందా? తెలంగాణ హైకోర్టు ఇదే ప్రశ్నను లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది.
తెలంగాణలో ఐఏఎస్ (IAS) అధికారులకు కేటాయించిన కీలకమైన పరిపాలనా పదవుల్లో ఐపీఎస్ (IPS) అధికారులను ఎందుకు నియమించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 2025లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 1342 ప్రకారం ఐపీఎస్‌లకు ఐఏఎస్ పోస్టులు కట్టబెట్టడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్ న్యాయవాది వడ్ల శ్రీకాంత్ వేసిన పిటిషన్‌పై కోర్టు సీరియస్‌గా స్పందించింది. డిసెంబర్ 10లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని డెడ్‌లైన్ విధించింది.
పాలన వేరు.. పోలీసింగ్ వేరు!
ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ పోస్టుల్లో నియమించడం కేంద్ర సర్వీసుల చట్టాలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ప్రజా పరిపాలన, గవర్నెన్స్ కోసం ఐఏఎస్‌లకు ప్రత్యేక శిక్షణ ఉంటే.. ఐపీఎస్‌లు శాంతిభద్రతల పర్యవేక్షణలో నిపుణులు. ఈ రెండు విధులను కలగాపులగం చేయడం వల్ల పాలనా వ్యవస్థలో ఉండాల్సిన తటస్థత (Neutrality) దెబ్బతింటుందని, ఇది వ్యవస్థకు మంచిది కాదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.
లిస్ట్‌లో ఉన్నది ఈ బడా ఆఫీసర్లే!
ప్రస్తుతం కీలకమైన ఐఏఎస్ పోస్టుల్లో కొనసాగుతున్న ఐపీఎస్ అధికారుల జాబితాను కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. వీరిలో స్టీఫెన్ రవీంద్ర (పౌర సరఫరాల కమిషనర్), శిఖా గోయల్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ), సి.వి. ఆనంద్ (హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ) వంటి సీనియర్ అధికారులు ఉన్నారు. గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని, పోలీస్ మరియు పాలనా విభాగాలు వేర్వేరుగా ఉండాల్సిన ఆవశ్యకతను పిటిషనర్ నొక్కి చెప్పారు.
ఈ సంప్రదాయం 2014లోని గత ప్రభుత్వం హయాంలోనే మొదలైందని తెలుస్తోంది. అయితే, దీనిపై సమగ్ర వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో, హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేసింది.

