సక్సెస్ వస్తే క్రెడిట్ తీసుకోవడానికి అందరూ ముందుంటారు. ఇప్పుడు భారత్-పాకిస్తాన్ వ్యవహారంలో అదే జరుగుతోంది. 2025 మే నెలలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' ఘర్షణలను తామే ఆపామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబ్బాలు కొట్టుకుంటుంటే, ఇప్పుడు చైనా కూడా అదే పాట పాడుతోంది. "మీరు కాదు, ఆ గొడవను ఆపింది మేమే" అంటూ డ్రాగన్ దేశం కొత్త రాగం ఎత్తుకుంది. అయితే, ఈ ఇద్దరి వాదనలను భారత్ తీవ్రంగా ఖండించింది. మా గొడవలు మా ఇష్టం, మధ్యలో మీ పెత్తనం ఏంటని గట్టి కౌంటర్ ఇచ్చింది.
బీజింగ్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన మయన్మార్, ఇరాన్ అణు సమస్యలతో పాటు.. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతలను కూడా చైనా తన మధ్యవర్తిత్వం ద్వారానే తగ్గించిందని గొప్పలు చెప్పుకున్నారు. పొరుగు దేశాలతో తమ సంబంధాలు మెరుగుపడ్డాయని, అందుకే భారత ప్రధాని మోదీని ఆగస్ట్‌లో టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ (SCO) సమ్మిట్‌కు ఆహ్వానించామని ఉదాహరణగా చూపించారు. ట్రంప్ తరచూ చేస్తున్న వ్యాఖ్యల తరహాలోనే చైనా కూడా తాము "శాంతి దూతలు" అని కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది.
కానీ, చైనా వాదనలను భారత విదేశాంగ శాఖ (MEA) పటాపంచలు చేసింది. మే 7 నుంచి 10 వరకు జరిగిన ఆపరేషన్ సిందూర్ ఘర్షణలు.. కేవలం ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారానే ముగిశాయని తేల్చి చెప్పింది. మే 10న జరిగిన ఫోన్ కాల్ ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందే తప్ప, ఇందులో అమెరికా లేదా చైనా వంటి మూడో దేశం ప్రమేయం 'సున్నా' అని భారత్ పునరుద్ఘాటించింది. ద్వైపాక్షిక విషయాల్లో మూడో వారి జోక్యాన్ని భారత్ ఎప్పుడూ సహించదని స్పష్టం చేసింది.
మరోవైపు భారత సైనిక వర్గాలు చైనా ద్వంద్వ వైఖరిని ఎండగట్టాయి. ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తూనే.. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు చైనా భారీగా ఆయుధాలను సరఫరా చేసిందని ఆరోపించాయి. చైనా తన ప్రాచీన '36 యుద్ధ వ్యూహాలను' (36 Stratagems) అమలు చేస్తూ.. పాకిస్తాన్ అనే 'అరువు కత్తి'తో భారత్‌ను దెబ్బతీయాలని చూసిందని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్. సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘర్షణను చైనా శాంతి కోసం కాకుండా, తన ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి ఒక 'లైవ్ ల్యాబ్'లా వాడుకుందని భారత్ ధ్వజమెత్తింది.
బాటమ్ లైన్..
ఇక్కడ చైనా, అమెరికాలు 'క్రెడిట్' కోసం పోటీ పడుతున్నాయే తప్ప, నిజమైన శాంతి కోసం కాదు.
గ్లోబల్ ఇమేజ్: తాము ప్రపంచ పెద్దన్నలం అని చెప్పుకోవడానికి ట్రంప్, ఆసియాలో తామే తోపులం అని చెప్పుకోవడానికి చైనా.. భారత్-పాక్ ఇష్యూను వాడుకుంటున్నాయి. ఇదొక జియోపొలిటికల్ గేమ్.
భారత్ స్టాండ్: "మా సమస్యలు మేము పరిష్కరించుకోగలం, మీ మధ్యవర్తిత్వం అక్కర్లేదు" అని భారత్ చెప్పడం.. మన విదేశాంగ విధానం ఎంత బలంగా ఉందో చాటిచెబుతోంది. సిమ్లా ఒప్పందం ప్రకారం మూడో దేశం జోక్యం చెల్లదు.
డ్రాగన్ డబుల్ గేమ్: నోటితో శాంతి, చేతిలో కత్తి.. ఇదీ చైనా నైజం. పాకిస్తాన్‌ను ఎగదోస్తూ, మళ్లీ తామే ఆపామని చెప్పుకోవడం వారి కుటిల నీతికి నిదర్శనం.

