ప్రేమలో ఉన్నప్పుడు ఆకాశం నుంచి నక్షత్రాలు కోసి ఇస్తామని డైలాగులు కొట్టడం కామనే. కానీ బ్రేకప్ అయ్యాక.. "నువ్వు తిన్న తిండికి, కొనుక్కున్న బట్టలకు డబ్బులు వెనక్కి ఇవ్వు" అని ఎవరైనా అడుగుతారా? చైనాలో ఓ ప్రబుద్ధుడు ఇదే పని చేశాడు. ఏకంగా మాజీ ప్రియురాలిని కోర్టుకు లాగాడు.
చైనా (China)లోని హిలోంజియాంగ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమించిన అమ్మాయిపై దావా వేసిన ఆ యువకుడికి కోర్టు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చింది.
అసలేం జరిగింది?
ఈ వింత కథలోని పాత్రధారులు 'హె' (He) అనే యువకుడు, 'వాంగ్' (Wang) అనే యువతి.
పరిచయం: వీరిద్దరికీ ఒక మాట్రిమోనియల్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, ఎంగేజ్‌మెంట్ (Engagement) వరకు వెళ్లింది.
సహజీవనం: ఈ క్రమంలో ఇద్దరూ కొంతకాలం రిలేషన్ షిప్‌లో ఉన్నారు. 'హె' వాళ్ళ తల్లిదండ్రుల హోటల్‌లోనే వాంగ్ పనిచేసేది.
బ్రైడ్ ప్రైస్: ఎంగేజ్‌మెంట్ సమయంలో చైనా సంప్రదాయం ప్రకారం.. యువకుడి తల్లిదండ్రులు 'బ్రైడ్ ప్రైస్' (వధువుకు ఇచ్చే కట్నం లాంటిది) కింద వాంగ్‌కు 20 వేల యువాన్లు ఇచ్చారు.
"తిండిపోతు.. నా డబ్బులన్నీ ఖర్చు చేసింది!"
ఆరు నెలలు గడిచాక వీరి మధ్య గొడవలు వచ్చాయి. వాంగ్ ప్రవర్తన నచ్చలేదంటూ 'హె' పెళ్లిని రద్దు చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా కోర్టులో దావా వేశాడు.
ఆరోపణలు: "వాంగ్‌కు పని కంటే తిండి మీదే ధ్యాస ఎక్కువ. ఎప్పుడూ షాపింగ్ చేస్తూ నా డబ్బుతో బట్టలు, ఇతర వస్తువులు కొనుక్కుంది" అని ఆరోపించాడు.
డిమాండ్: ఆమె ఖర్చుల కోసం తాను 30 వేల యువాన్లు పెట్టానని, బ్రైడ్ ప్రైస్ 20 వేల యువాన్లు కలిపి.. మొత్తం 50 వేల యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 6.3 లక్షలు) తనకు తిరిగి ఇప్పించాలని కోరాడు.
కోర్టు తీర్పు ఏంటి?
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
రోజువారీ ఖర్చులు: ప్రేమలో ఉన్నప్పుడు ఒకరి కోసం ఒకరు ఖర్చు పెట్టడం, బహుమతులు ఇచ్చుకోవడం అనేది ఆ బంధంలో ఉన్న 'భావోద్వేగ విలువ' (Emotional Value)ను తెలియజేస్తుందని, ఆ డబ్బును తిరిగి ఇవ్వమనడం సరికాదని జడ్జి స్పష్టం చేశారు. తిండి, షాపింగ్ ఖర్చుల పిటిషన్‌ను కొట్టివేశారు.
బ్రైడ్ ప్రైస్: అయితే, సంప్రదాయం ప్రకారం ఇచ్చిన 'బ్రైడ్ ప్రైస్' మాత్రం వేరు అని పేర్కొంటూ.. అందులో సగం అంటే 10 వేల యువాన్లు తిరిగి ఇవ్వాలని యువతిని ఆదేశించారు.

.webp)