సోషల్ మీడియాలో కొన్నిసార్లు అత్యుత్సాహం శృతి మించుతుంది. లైకులు, వ్యూస్ కోసం కొందరు చేసే పనులు పేదవారి పొట్ట కొడుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే మేడారం జాతరలో కర్నూలుకు చెందిన చిరు వ్యాపారి వలీకి ఎదురైంది. అయితే, కష్టాల్లో ఉన్న ఆ వ్యాపారికి ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ బాసటగా నిలిచారు. వలీపై జరిగిన ప్రచారాన్ని ఖండించడమే కాకుండా, త్వరలోనే ఆయన్ను కలిసి ఆ ఫేమస్ కోవా బన్ రుచి చూస్తానని లోకేష్ మాటిచ్చారు. ఈ ఒక్క ట్వీట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
కర్నూలుకు చెందిన కోవా బన్ వ్యాపారి వలీకి జరిగిన అవమానంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ప్రియమైన సోదరుడు వలీ.. మీరు ఇలాంటి పరిస్థితిని భరించాల్సి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. మన తెలుగు సమాజం ఎప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావంతో ఉంటుందని, ఇలాంటి విభజన, మతపరమైన ప్రవర్తనకు ఇక్కడ స్థానం లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, త్వరలోనే వలీని ప్రత్యక్షంగా కలుస్తానని, అతను చేసే ఫేమస్ కోవా బన్ తినడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు. లోకేష్ స్పందనతో ఆ చిరు వ్యాపారికి కొండంత అండ లభించినట్లయింది.
అసలు ఏం జరిగిందంటే.. రాయలసీమలోని కర్నూలుకు చెందిన వలీ, జీవనోపాధి కోసం తెలంగాణలోని మేడారం జాతరలో చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కేవలం రూ.10లకే కోవా బన్ విక్రయిస్తున్నారు. అయితే, కొంతమంది యూట్యూబర్లు ఆ స్టాల్ వద్దకు వెళ్లి, ఆ ఆహార పదార్థంపై అనుమానాలు రేకెత్తించేలా, వలీని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు భగ్గుమన్నారు. కేవలం వ్యూస్ కోసం ఒక పేదవాడి వ్యాపారాన్ని దెబ్బతీస్తారా అంటూ నెటిజన్లు వలీకి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే ఈ విషయం లోకేష్ వరకు వెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.
లోకేష్ మాత్రమే కాకుండా టీడీపీకి చెందిన ఇతర నేతలు కూడా వలీకి మద్దతు పలికారు. పరిటాల శ్రీరామ్, బైరెడ్డి శబరి వంటి యువ నేతలు వలీకి అండగా నిలుస్తూ ట్వీట్లు చేశారు. "ఆకలికి కులం ఉండదు.. ఆత్మగౌరవానికి మతం ఉండదు.. కష్టానికి పార్టీ రంగు ఉండదు" అంటూ వారు పేర్కొన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా, కష్టపడి బతికే వారిపై నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం చాలా సులభమని, కానీ ఆ వ్యక్తి బాధను అర్థం చేసుకుని సాయం చేయడానికి ధైర్యం కావాలని అభిప్రాయపడ్డారు. మొత్తానికి సోషల్ మీడియాలో జరిగిన దాడిని, సోషల్ మీడియా వేదికగానే తిప్పికొట్టి వలీకి అండగా నిలవడం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
కష్టం విలువేంటో తెలిసిన వాళ్లే మనుషులు!
వ్యూస్ పిచ్చితో ఒకరి బతుకుతో ఆడుకోవడం ఎంత తప్పో ఈ ఘటన నిరూపించింది. లోకేష్ భరోసాతో ఇప్పుడు 'కోవా బన్ వలీ' స్టాల్ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది.

