నది మీద బ్రిడ్జిలు కట్టడం మనం చూశాం. కానీ నది గర్భంలోంచి రైలు, బస్సు పరుగెత్తడం ఎప్పుడైనా చూశారా? ఇకపై ఆ అద్భుతం మన ఇండియాలోనే జరగబోతోంది. ఈశాన్య భారత ముఖచిత్రాన్ని మార్చేసేలా, డ్రాగన్ దేశం చైనాకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద దేశంలోనే మొట్టమొదటి 'అండర్ వాటర్ ట్విన్ టన్నెల్' నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటి అడుగున రోడ్డు, రైలు మార్గం ఉండే ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే రెండోది కావడం విశేషం. అసలు దీనికి రూ.18 వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? దీని వెనుక ఉన్న రక్షణ వ్యూహం ఏంటి?
6 గంటల ప్రయాణం.. చిటికెలో!
ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్రం వేసిన అతిపెద్ద అడుగు ఇది. గోహ్‌పూర్-నుమాలిగఢ్ మధ్య నిర్మించనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ కోసం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏకంగా రూ.18,662 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం నుమాలిగఢ్ నుంచి గోహ్‌పూర్ చేరుకోవాలంటే కాజీరంగ నేషనల్ పార్క్ చుట్టూ తిరిగి దాదాపు 240 కిలోమీటర్లు ప్రయాణించాలి.
ఇందుకు సుమారు 6 గంటల సమయం పడుతుంది. కానీ బ్రహ్మపుత్ర నది కింద ఈ సొరంగ మార్గం పూర్తయితే ఆ దూరం భారీగా తగ్గిపోయి, ప్రయాణ సమయం కేవలం నిమిషాల్లోకి మారిపోతుంది. అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల రవాణా వ్యవస్థకు ఇది జీవనాడిగా మారనుంది. 11 ఆర్థిక కేంద్రాలు, 4 రైల్వే స్టేషన్లు, 2 విమానాశ్రయాలను ఇది అనుసంధానిస్తుంది.
చైనాకు వణుకు పుట్టేలా.. డిఫెన్స్ మాస్టర్ ప్లాన్
ఇది కేవలం ప్రయాణికుల సౌకర్యం కోసం మాత్రమే నిర్మిస్తున్న ప్రాజెక్టు కాదు, దీని వెనుక భారత్ రక్షణ దళాల మాస్టర్ ప్లాన్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ, మన సైన్యం, యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామాగ్రిని వేగంగా సరిహద్దులకు తరలించడానికి ఈ టన్నెల్ బ్రహ్మాస్త్రంలా పనిచేయనుంది.
శత్రువుల శాటిలైట్లకు చిక్కకుండా నది కింద నుంచి సైనిక కదలికలు జరపడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి తోడు నిన్ననే ప్రధాని మోదీ దిబ్రూఘర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ పై సి-130జే యుద్ధ విమానంలో దిగడం ద్వారా శత్రుదేశాలకు గట్టి హెచ్చరిక పంపారు. అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు రోడ్లపై దిగేలా ఏర్పాట్లు చేయడం, ఇప్పుడు నది కింద సొరంగం నిర్మించడం.. ఇవన్నీ భారత్ రక్షణ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తున్నాయి.
ఇది ఇంజినీరింగ్ అద్భుతం.. రక్షణ కవచం!
లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించి వ్యాపారాలకు ఊతమివ్వడమే కాదు, దేశ రక్షణకు ఈ టన్నెల్ ఒక గేమ్ ఛేంజర్ కాబోతోంది. బ్రహ్మపుత్ర గర్భంలో భారత్ సత్తా ప్రపంచానికి తెలియబోతోంది.

