బంగ్లాదేశ్‌లో మత విద్వేషం మరో అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. 'మత దూషణ' (Blasphemy) చేశాడనే నెపంతో ఒక హిందూ యువకుడిని ఉన్మాద మూక దారుణంగా హత్య చేసింది. అయితే, ఆ యువకుడు ఎలాంటి తప్పు చేయలేదని, ఆ ఆరోపణలన్నీ అబద్ధమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలడం విషాదకరం.
డిసెంబర్ 18 రాత్రి బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ (Mymensingh) ప్రాంతంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిపై అకారణంగా నిందలు వేసి, కొట్టి చంపి, చివరకు మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు.
అసలేం జరిగింది?
ఫ్యాక్టరీలో పని చేస్తున్న దీపుపై సహోద్యోగి చేసిన ఓ చిన్న ఆరోపణ పెను విధ్వంసానికి దారితీసింది.
ఆరోపణ: దీపు ఇస్లాం మతాన్ని కించపరిచాడంటూ ప్రచారం చేశారు. దీంతో రెచ్చిపోయిన అల్లరిమూక అతడిపై దాడికి దిగింది.
యాజమాన్యం తీరు: ఫ్యాక్టరీలో గొడవ జరుగుతుంటే.. తమ ఆస్తికి నష్టం కలగకూడదనే స్వార్థంతో యాజమాన్యం దీపును బలవంతంగా బయటకు నెట్టివేసింది. ఆ తర్వాతే మూక అతడిని దారుణంగా హత్య చేసింది.
ఆ ఆరోపణల్లో నిజం లేదు!
ఈ ఘటనపై విచారణ జరిపిన ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB-14) కమాండర్ మహ్మద్ సంసుజ్జమాన్ సంచలన విషయాలు బయటపెట్టారు.
సోషల్ మీడియా క్లీన్: దీపు తన సోషల్ మీడియా ఖాతాల్లో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు.
సాక్షులు లేరు: "దీపు మతాన్ని విమర్శించడం మేము స్వయంగా విన్నాము" అని చెప్పే ఒక్క సాక్షి కూడా అక్కడ లేరు. కేవలం పుకార్లతోనే ఇంతటి ఘోరానికి పాల్పడ్డారని అధికారి స్పష్టం చేశారు.
10 మంది అరెస్ట్.. అంతర్జాతీయంగా ఆగ్రహం
వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై 'ఉత్తర అమెరికా హిందూ కూటమి' (CoHNA) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ ఒక ఆటవిక రాజ్యంలా మారుతోందని, హిందువులపై ఇంతటి హింస జరుగుతున్నా అంతర్జాతీయ మీడియా, ప్రపంచ దేశాలు మౌనంగా ఉండటం శోచనీయమని పేర్కొంది.

