తెలంగాణలో పల్లె పోరు ముగిసింది. ఫలితాలు వచ్చేశాయి. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. అయితే, గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఒక బిగ్ అలర్ట్ జారీ చేసింది.
విజయోత్సవాల్లో మునిగిపోయి అసలు విషయం మర్చిపోతే.. గెలిచిన పదవి చేజారిపోయే ప్రమాదం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఖర్చు వివరాలను 45 రోజుల్లోగా వెల్లడించాలని ఎస్‌ఈసీ కార్యదర్శి మకరంద్ స్పష్టం చేశారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
లెక్క చెప్పకపోతే.. పదవి గోవిందా!
నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను ఎంపీడీవోలకు సమర్పించి, 'టీఈ-పోల్' (TE-Poll) పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
అనర్హత వేటు: గడువులోగా లెక్కలు చెప్పని వారు లేదా తప్పుడు లెక్కలు చూపిన వారు.. 'తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018'లోని సెక్షన్ 23 ప్రకారం తమ పదవిని కోల్పోతారు.
మూడేళ్లు నిషేధం: అంతేకాదు, వారు రాబోయే మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది.
డెడ్‌లైన్ ఎప్పుడంటే?
విడతల వారీగా ఎన్నికలు జరగడంతో, ఖర్చు వివరాల సమర్పణకు వేర్వేరు గడువులు విధించారు.
తొలి విడత: 2026, జనవరి 24 లోపు.
రెండో విడత: జనవరి 27 లోపు.
మూడో విడత: జనవరి 30 లోపు. (ఈ నివేదికలను 2026 ఫిబ్రవరి 15 నాటికి ఎస్‌ఈసీకి పంపాల్సి ఉంటుంది).
ఖర్చు పరిమితి ఎంత?
ఎన్నికల సంఘం జనాభా ప్రాతిపదికన ఖర్చు పరిమితిని ముందే నిర్ణయించింది.
5 వేల లోపు జనాభా: సర్పంచ్ అభ్యర్థి గరిష్ఠంగా రూ. 1.50 లక్షలు, వార్డు మెంబర్ రూ. 30 వేలు.
5 వేలకు పైగా జనాభా: సర్పంచ్ అభ్యర్థి గరిష్ఠంగా రూ. 2.50 లక్షలు, వార్డు మెంబర్ రూ. 50 వేలు.
డిసెంబర్ 22న ప్రమాణ స్వీకారం
మొత్తం మూడు విడతల్లో 85.30 శాతం భారీ పోలింగ్ నమోదైంది. 1,205 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు డిసెంబర్ 22 (సోమవారం) నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విధుల్లో ఉండి మరణించిన సిబ్బందికి ఎస్ఈసీ కమిషనర్ రాణి కుముదిని సంతాపం తెలిపారు.

