పొరుగు దేశం బంగ్లాదేశ్ మళ్లీ అట్టుడికిపోతోంది. హసీనా సర్కార్‌ను కూల్చడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత మరణంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఆందోళనకారులు భారత దౌత్య కార్యాలయాలే టార్గెట్‌గా దాడులకు దిగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది.
బంగ్లాదేశ్‌లో యువ నేత, 'ఇంక్విలాబ్ మంచ్' కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది మరణవార్త ఆ దేశాన్ని నిప్పులకొలిమిలా మార్చేసింది. గత శుక్రవారం కాల్పుల్లో గాయపడి సింగపూర్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు రాజధాని ఢాకాతో పాటు పలు నగరాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు.
భారత హైకమిషన్‌పై దాడి..
నిరసనకారుల సెగ భారత్‌కు కూడా తాకింది. గురువారం రాత్రి చత్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ముట్టడి: వందలాది మంది ఆందోళనకారులు కార్యాలయాన్ని చుట్టుముట్టారు. భారత్‌కు, అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు.
ఆరోపణ: హైది మరణం వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ ఆందోళనకారులు భారత కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
మీడియా ఆఫీసులకు నిప్పు..
మరోవైపు మీడియా సంస్థలపైనా అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి. ప్రముఖ పత్రిక 'డెయిలీ స్టార్' కార్యాలయంపై దాడి చేసి నిప్పు పెట్టారు.
రెస్క్యూ: మంటల్లో చిక్కుకున్న సుమారు 25 మంది జర్నలిస్టులను రెస్క్యూ టీమ్ అతికష్టమ్మీద కాపాడింది.
దాడులు: 'ప్రోథోమ్ అలో' ఆఫీసును ధ్వంసం చేయడంతో పాటు, 'న్యూఏజ్' ఎడిటర్ నూరుల్ కబీర్‌పై కూడా దాడులు జరిగాయి. దీంతో అక్కడి పత్రికలు నిరసనగా తమ పనులను ఆపేశాయి.
ముజిబుర్ రెహమాన్ ఇంటి ధ్వంసం
నిరసనకారుల విధ్వంసం అంతటితో ఆగలేదు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ పూర్వీకుల నివాసాన్ని (మ్యూజియం) కూడా ధ్వంసం చేశారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం శాంతి కోసం ప్రయత్నిస్తున్నా.. క్షేత్రస్థాయిలో హింస అదుపులోకి రావడం లేదు. అంతర్జాతీయ దౌత్య కార్యాలయాలపై దాడులు బంగ్లాదేశ్‌ను ప్రపంచదేశాలకు దూరం చేసే ప్రమాదం కనిపిస్తోంది.

