అమెరికా అంటే డాలర్ల వర్షం, లగ్జరీ లైఫ్, అద్భుతమైన జీవితం అని చాలామంది కలలు కంటారు. కానీ ఆ కలల దేశంలో బతకడం ఎంత కాస్ట్లీనో, అక్కడ బిల్లులు చూస్తే గుండె ఆగిపోవడం ఖాయమని ఒక ఎన్నారై అనుభవం చెబుతోంది. ఎనిమిదేళ్ల తర్వాత ఇండియాలో అడుగుపెట్టిన ఓ ఎన్నారై.. ఇక్కడి అభివృద్ధిని, తక్కువ ఖర్చులను చూసి షాక్ అయ్యాడు. "అమెరికాలో మేము బతుకుతున్నామా? లేక బిల్లులు కట్టడానికే సంపాదిస్తున్నామా?" అనే సందేహం వచ్చేలా ఆయన చెప్పిన లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
'వీకెండ్ ఇన్వెస్టింగ్' వ్యవస్థాపకుడు అలోక్ జైన్ తన స్నేహితుడి అనుభవాన్ని పంచుకుంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. న్యూయార్క్ నుంచి ఎనిమిదేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన ఆ మిత్రుడు, దేశంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని, ఇక్కడి ఎనర్జీని చూసి ఆశ్చర్యపోయాడు. ముఖ్యంగా ఇండియాలో వైద్యం, రవాణా, ఇంటర్నెట్ డేటా ఖర్చులు ఇంత తక్కువగా ఉన్నాయా అని నోరెళ్లబెట్టాడు. ఇక్కడ మనం వంద రూపాయలకు అన్ లిమిటెడ్ డేటా వాడుతుంటే.. అమెరికాలో తన ఇంట్లో మొబైల్, డేటా కోసం నెలకు 600 డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 50,000 కడుతున్నట్లు చెప్పాడు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే నలుగురు సభ్యుల కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఏటా 30,000 డాలర్లు అంటే దాదాపు రూ. 25 లక్షలు చెల్లించాల్సి వస్తుందని వాపోయాడు. ఆస్తి పన్నుల మోత కూడా అక్కడ భారీగానే ఉంటుందట.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు "ఇండియాలో లైఫ్ ఈజీ, తక్కువ ఖర్చుతో ప్రశాంతంగా బతకొచ్చు, ఇక్కడ ఉన్న ఆధ్యాత్మికత, బంధాలు అక్కడ దొరకవు" అని సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. "డబ్బులు తక్కువ ఖర్చవ్వచ్చు, కానీ ఊపిరి పీల్చుకోవడానికి మంచి గాలి ఉందా? నడవడానికి సరైన ఫుట్‌పాత్‌లు ఉన్నాయా? న్యూయార్క్ జీవన ప్రమాణాలతో పోల్చకండి" అని విమర్శిస్తున్నారు. "నిజంగా ఇండియా అంత బాగుంటే, మీ ఫ్రెండ్‌ని పర్మనెంట్‌గా వచ్చేయమనండి చూద్దాం" అని సవాలు విసురుతున్నారు. గత నెలలో ఓ ఎన్నారై దంపతులు అమెరికాలో వైద్య ఖర్చులు భరించలేక 17 ఏళ్ల తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన ఘటనను కూడా ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.
A friend visited me from New York today. He had come to India after 8 yrs.
— Alok Jain ⚡ (@WeekendInvestng) December 23, 2025
He was all praise for the amazing energy in the country and how rapidly he felt India is growing.
An outsiders perspective can be so different from our own.
He was shocked to see our cost of medical…
వాస్తవం ఏంటంటే..
ఈ చర్చలో ఎవరి వాదన వారిదే అయినా.. ఒక నగ్న సత్యం మాత్రం బయటపడింది. 'అమెరికన్ డ్రీమ్' (American Dream) అనేది ఒకప్పుడు ఉన్నంత గొప్పగా ఇప్పుడు లేదు. ఒక సామాన్యుడి కోణంలో చూస్తే.. ఇండియా అనేది 'వాల్యూ ఫర్ మనీ' (Value for Money). ఇక్కడ తక్కువ ఖర్చుతో కనీస అవసరాలు తీర్చుకోవచ్చు. డిజిటల్ పేమెంట్స్, ఆన్‌లైన్ సేవల్లో మనం అమెరికాను కూడా దాటేశాం. కానీ, 'క్వాలిటీ ఆఫ్ లైఫ్' (Quality of Life) దగ్గరే అసలు సమస్య వస్తోంది. కాలుష్యం, ట్రాఫిక్, మౌలిక సదుపాయాల విషయంలో మనం ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉంది. డబ్బులు ఆదా చేసుకోవాలంటే ఇండియా బెస్ట్.. కానీ స్వచ్ఛమైన గాలి, క్రమశిక్షణ కావాలంటే అమెరికా బెటర్. చివరగా ఒక్క మాట.. అక్కడ డాలర్లు మిగులుతాయేమో కానీ, ఇక్కడ మనశ్శాంతి మిగులుతుంది. ఛాయిస్ ఎవరిది వారిదే!

