అమెరికాలో మన 'ఘాటు' మసాలాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది! ఒకప్పుడు బటర్ చికెన్‌కే పరిమితమైన వాళ్లు.. ఇప్పుడు మన బిర్యానీ రుచి చూసి ఫిదా అవుతున్నారు.
అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లలో వస్తున్న అనూహ్య మార్పులు, మన ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి సరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తున్నాయి. సాధారణంగా తక్కువ మసాలాలు ఉండే థాయ్, జపనీస్ ఫుడ్ ఇష్టపడే అమెరికన్లు, ఇప్పుడు మన స్పైసీ బిర్యానీలు, ఘాటైన కూరలను లొట్టలేసుకుని తింటున్నారు.
బటర్ చికెన్ బోర్ కొట్టింది.. బిర్యానీ కావాలి!
కాలిఫోర్నియాలో ఓ తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుభవమే ఇందుకు నిదర్శనం. తన అమెరికన్ కొలీగ్స్‌కు పార్టీ ఇస్తే.. వాళ్లంతా మన దక్షిణాది వంటకాలపైనే మనసు పారేసుకున్నారట. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ధర తక్కువగా ఉన్నా, రేటు గురించి ఆలోచించకుండా ఇండియన్ రెస్టారెంట్లలో క్యూ కడుతున్నారు. ఈ మార్పు చూసి మన వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.
అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్ల హవా!
ఈ డిమాండ్ కారణంగా అమెరికా వ్యాప్తంగా భారతీయ రెస్టారెంట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2025 అక్టోబర్ గణాంకాల ప్రకారం:
అమెరికాలో మొత్తం 10,000 ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి.
అందులో 2,000 రెస్టారెంట్లతో కాలిఫోర్నియా టాప్‌లో ఉంది.
ఆ తర్వాత టెక్సాస్ (1,500), న్యూయార్క్ (1,000) రాష్ట్రాలు ఉన్నాయి.
డాలస్.. మన 'దక్షిణాది' అడ్డా!
ముఖ్యంగా న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, షికాగో వంటి మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక డాలస్ మెట్రో ప్రాంతం అయితే సుమారు 400 రెస్టారెంట్లతో దక్షిణ భారత రుచులకు చిరునామాగా మారింది. మొత్తానికి మన బిర్యానీ ఘాటు అగ్రరాజ్యాన్ని కూడా ఊపేస్తోందన్నమాట.

