ప్రాణం పోయాల్సిన రక్తమే వారి పాలిట శాపమైంది. వైద్యుల నిర్లక్ష్యం ఐదుగురు అమాయక చిన్నారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది.
మధ్యప్రదేశ్‌లోని సత్నా (Satna) జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగుచూసింది. థలసేమియా (Thalassemia) వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ సోకిన రక్తాన్ని (HIV infected blood) ఎక్కించారు. బతకడం కోసం క్రమం తప్పకుండా రక్తం ఎక్కించుకుంటే.. అదే ఇప్పుడు వారిని కోలుకోలేని వ్యాధి బారిన పడేసింది.
9 నెలలుగా తొక్కిపెట్టారు..
ఈ దారుణం ఈరోజో రేపో జరిగింది కాదు. ఈ ఏడాది మార్చి 20వ తేదీనే ఓ 15 ఏళ్ల బాలుడికి హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ నాటికి ఆ సంఖ్య పెరిగింది. అయినా అధికారులు దాదాపు తొమ్మిది నెలల పాటు ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా తొక్కిపెట్టారు.
తాజాగా జరిగిన విచారణలో.. ఈ పిల్లలకు సుమారు 189 యూనిట్ల రక్తాన్ని ఎక్కించినట్లు, దాతల నుంచి రక్తం సేకరించేటప్పుడు కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని తేలింది. 250 మంది దాతల్లో కేవలం 125 మంది రికార్డులే ఉండటం గమనార్హం.
కన్నవారి కడుపుకోత..
"మా పాపకు రక్తమే ప్రాణం.. కానీ అదే ఇప్పుడు యమపాశం అయ్యింది. మందులు పడక బిడ్డ నీరసించిపోతోంది. వాంతులు చేసుకుంటోంది. అసలు దీనికి బాధ్యులు ఎవరు?" అంటూ ఓ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ పిల్లలు ఇప్పుడు జీవితాంతం యాంటీ రెట్రోవైరల్ ట్రీట్‌మెంట్ (ART) తీసుకోవాల్సి రావడం వారిపై పెను ఆర్థిక భారంగా మారింది.
స్పందించిన సర్కార్.. చర్యలు షురూ!
ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను, బ్లడ్ బ్యాంక్ ఇంచార్జిని సస్పెండ్ చేసింది. మాజీ సివిల్ సర్జన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇది ముమ్మాటికీ నేరపూరిత నిర్లక్ష్యమేనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

