హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఓ ఐకానిక్ నిర్మాణం కనుమరుగు కాబోతోంది. దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ పాత బ్రిడ్జిని కూల్చివేసేందుకు రైల్వే అధికారులు ముహూర్తం ఖరారు చేశారు.
దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికుల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న అధికారులు.. ప్రమాదకరంగా ఉన్న పాత కట్టడాలను తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా నాంపల్లి స్టేషన్‌లో బేగంపేట వైపు ఉన్న పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జిని (FOB) కూల్చివేయనున్నారు.
రేపటి నుంచే పనులు..
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రేపటి నుంచి అంటే డిసెంబర్ 20 నుంచి 23వ తేదీ మధ్యలో ఈ కూల్చివేత పనులు జరగనున్నాయి.
భద్రతా చర్యలు: ఈ సమయంలో రైళ్ల రాకపోకలకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పక్కా ప్రణాళికతో పనులు చేపట్టనున్నారు.
సహకారం: ఈ పనుల వల్ల కలిగే తాత్కాలిక అసౌకర్యాన్ని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
ప్లాట్‌ఫారమ్‌కు లింక్ లేదు..
ఈ బ్రిడ్జికి ఒక విచిత్రమైన చరిత్ర ఉంది. సుమారు 5 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన.. నగరంలోని రెడ్ హిల్స్ ప్రాంతాన్ని, పబ్లిక్ గార్డెన్‌ను కలుపుతుంది. కానీ స్టేషన్‌లోని ఏ ప్లాట్‌ఫారమ్‌కూ దీనితో అనుసంధానం లేదు.
ప్రమాదకరం: రైల్వే యార్డ్ లైన్ల మీదుగా ఉన్న ఈ బ్రిడ్జి ప్రస్తుతం పూర్తి శిథిలావస్థకు చేరింది. ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉండటంతో.. ముందు జాగ్రత్తగా దీనిని తొలగించాలని డిసైడ్ అయ్యారు.

