పాకిస్థాన్‌లో మళ్లీ హై టెన్షన్ మొదలైంది! జైల్లో ఉన్న ఆ మాజీ ప్రధాని ఆరోగ్యంపై వస్తున్న పుకార్లతో.. ప్రభుత్వం భయపడి అత్యవసరంగా కఠిన ఆంక్షలు విధించింది.
పాకిస్థాన్‌లోని రావల్పిండి జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ ఎత్తున నిరసనలకు దిగుతారన్న భయంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంతిభద్రతలను కాపాడే ఉద్దేశంతో డిసెంబర్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు నగరంలో అన్ని రకాల బహిరంగ సమావేశాలపై పూర్తి నిషేధం విధించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించిందన్న పుకార్లు, ఆయనను కలవడానికి అనుమతి ఇవ్వాలన్న డిమాండ్లు ఈ ఆందోళనలకు అసలు కారణం.
144 సెక్షన్.. ఐదుగురు గుమికూడితే అరెస్ట్!
నిఘా వర్గాల హెచ్చరికల మేరకు డెప్యూటీ కమిషనర్ డాక్టర్ హసన్ వకార్ చీమా ఈ ఆంక్షలను (Section 144) జారీ చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో అల్లరి మూకలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్లాన్ చేశాయని ఇంటెలిజెన్స్ రిపోర్టులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రావల్పిండిలో విధించిన కఠిన ఆంక్షలు ఇవే:
ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు చేయడం పూర్తిగా నిషేధం.
పెట్రోల్ బాంబులు, లాఠీలు, పేలుడు పదార్థాలు, ఇతర మారణాయుధాలు కలిగి ఉండటం నేరం.
ద్విచక్ర వాహనాలపై వెనుక సీటు ప్రయాణం (Pillion Riding), లౌడ్ స్పీకర్ల వాడకంపై కూడా నిషేధం విధించారు.
ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ ఈ నిరసనలకు పిలుపునివ్వడంతో, ప్రజల భద్రత దృష్ట్యా ఈ ఆంక్షలు తప్పలేదని అధికారులు స్పష్టం చేశారు.

