విజయ్ దేవరకొండతో పెళ్లి ఫిక్స్ అయినట్టేనా? రష్మిక తాజా కామెంట్స్ వింటే అవుననే అనిపిస్తోంది.. కానీ ఆమె మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు!
సమయం వచ్చినప్పుడే చెబుతా.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం కెరీర్ పీక్స్‌లో ఉన్నారు. 'ది గర్ల్ ఫ్రెండ్' బ్లాక్ బస్టర్ తర్వాత ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే, సినిమాల కంటే ఎక్కువగా ఆమె వ్యక్తిగత జీవితం గురించే సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉన్నారని, అక్టోబర్‌లో రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందని టాక్ బలంగా వినిపిస్తోంది.
ఈ వార్తలపై రష్మిక తాజాగా 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. అయితే ఆమె ఇచ్చిన సమాధానం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చింది. "నేను ఈ పెళ్లి వార్తలను ధృవీకరించను, అలాగని ఖండించను కూడా. దాని గురించి ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాను. సరైన సమయం వచ్చినప్పుడే ఆ విషయాలపై స్పందిస్తాను, అప్పటివరకు నేనేం చెప్పను," అని రష్మిక తెలివిగా సమాధానం దాటవేశారు.
ఫిబ్రవరిలో ముహూర్తం?
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల నుండే వీరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అక్టోబర్ నెలలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని, 2026 ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కనున్నారని ప్రచారం జరుగుతోంది. రష్మిక వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

