పల్లె పోరులో మళ్లీ 'హస్తం' జెండానే ఎగిరింది. తొలి విడత జోరును కొనసాగిస్తూ.. రెండో విడతలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినా రెండో స్థానానికే పరిమితమైంది.
తెలంగాణ గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 3,911 పంచాయతీలకు గానూ.. కాంగ్రెస్ మద్దతుదారులు ఏకంగా 2,200కు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల వ్యూహాలు ఫలించడంతో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పట్టు బిగించింది.
సిద్దిపేటలో గులాబీ గుభాళింపు..
మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) కూడా 1,100కు పైగా స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చింది. బీజేపీ మాత్రం 250 స్థానాలతో సరిపెట్టుకుంది.
బీఆర్ఎస్ కంచుకోటలు: సిద్దిపేట, జనగామ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది. ముఖ్యంగా హరీశ్ రావు ఇలాకాలో బీఆర్ఎస్ మద్దతుదారులు ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు.
బీజేపీ జోరు: నిర్మల్ జిల్లాలో కమలం పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం విశేషం.
రికార్డు స్థాయిలో పోలింగ్
తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 85.86 శాతం భారీ పోలింగ్ నమోదైంది. చిన్న చిన్న గొడవలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న సాయంత్రమే ఫలితాలు వెల్లడించడంతో గెలిచిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోయారు.
