క్రిస్మస్ రోజున 'యుద్ధం' ప్రకటించిన ట్రంప్: ఉగ్రవాదులకు రక్తంతో శుభాకాంక్షలు!
ప్రపంచం మొత్తం క్రిస్మస్ సంబరాల్లో మునిగితేలుతుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఉగ్రవాదులకు నెత్తుటి రుచి చూపించారు. శాంతి సందేశం వినిపించాల్సిన రోజున ఆయన యుద్ధం ప్రకటించారు. నైజీరియాలో క్రైస్తవుల ఊచకోతకు ప్రతీకారంగా, క్రిస్మస్ పండుగ రోజే ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, ప్రపంచానికి ట్రంప్ ఇచ్చిన ఒక బలమైన హెచ్చరిక. "మా జోలికి వస్తే, పండుగ రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టం" అనే సందేశాన్ని ఆయన స్పష్టంగా పంపారు.
నైజీరియా వాయువ్య ప్రాంతంలోని సోకోటో రాష్ట్రంలో 'లకూరవాస్' అనే కొత్త ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్న ఈ ముఠాపై ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ ముందే హెచ్చరించారు. చెప్పినట్లుగానే డిసెంబర్ 25 ఉదయం 6 గంటల ప్రాంతంలో అమెరికా యుద్ధ విమానాలు గర్జించాయి. గిదామ్ బిసా, గిడాన్ రొటోవా ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలను బాంబులతో నేలమట్టం చేశాయి. ఆకాశం నుంచి అమెరికా దళాలు విరుచుకుపడితే, తప్పించుకునే మార్గం లేకుండా నైజీరియా సైన్యం భూమార్గంలో వారిని దిగ్బంధించింది. ఈ ఆపరేషన్‌లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
ఈ దాడుల అనంతరం డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన ప్రభుత్వాన్ని 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్' (యుద్ధ శాఖ)గా అభివర్ణిస్తూ ఆయన సంచలన పోస్ట్ చేశారు. "క్రైస్తవుల ఊచకోతను ఆపకపోతే నరకమే చూపిస్తామని నేను ముందే చెప్పాను. ఈ రాత్రి అదే జరిగింది. చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ మెర్రీ క్రిస్మస్" అని ఆయన వ్యంగ్యంగా, అంతే ఘాటుగా వ్యాఖ్యానించారు. క్రైస్తవుల హత్యలు కొనసాగితే ఇలాంటి దాడులు మరిన్ని ఉంటాయని హెచ్చరించారు. అమెరికా ఆఫ్రికా కమాండ్ (AFRICOM) ఈ దాడులను అధికారికంగా ధ్రువీకరించగా, నైజీరియా ప్రభుత్వం కూడా దీనికి తమ పూర్తి సహకారం ఉందని ప్రకటించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సైతం "ఇది ఆరంభం మాత్రమే, ఇంకా రాబోతున్నాయి" అని చెప్పడం చూస్తుంటే, ట్రంప్ హయాంలో అమెరికా విదేశాంగ విధానం ఎంత దూకుడుగా ఉండబోతోందో అర్థమవుతోంది.
ట్రంప్ మార్క్ 'రాజకీయం'.. (Opinion)
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కేవలం ఉగ్రవాద నిర్మూలనే కాదు, బలమైన రాజకీయ వ్యూహం కూడా దాగి ఉంది. క్రిస్మస్ రోజునే దాడులు చేయడానికి ఆయన ఎంచుకున్న సమయం చాలా కీలకమైనది. ఇది తన కోర్ ఓట్ బ్యాంక్ అయిన క్రైస్తవ మత ఛాందసవాదులకు, కన్జర్వేటివ్‌లకు నేరుగా కనెక్ట్ అయ్యే అంశం. "క్రైస్తవుల రక్షకుడు నేనే" అని చెప్పుకోవడానికి ట్రంప్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇది.
మరోవైపు, అంతర్జాతీయ సమాజానికి కూడా ఆయన ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. బైడెన్ హయాంలో అమెరికా మెతక వైఖరి అవలంబించిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఆ ఇమేజ్‌ను చెరిపేసుకుని, అమెరికా అంటేనే 'పవర్' అని గుర్తుచేస్తున్నారు. "మా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాదు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్" అని పిలవడం ద్వారా.. రాబోయే రోజుల్లో అమెరికా శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. అయితే, ఇలాంటి ఏకపక్ష దాడులు దీర్ఘకాలంలో ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తాయా అనేది వేచి చూడాలి.

