"ట్రంప్ చేశారు.. మరి మీరేం చేస్తున్నారు మోదీ గారు?" పాక్ ఉగ్రవాదులను లాక్కొచ్చే ధైర్యం ఉందా? అసదుద్దీన్ సవాల్!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పని ఇప్పుడు భారత రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అర్ధరాత్రి ఎత్తుకెళ్లిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోదీకి గట్టి సవాల్ విసిరారు.
"ట్రంప్ అంతటి వాడు వేరే దేశానికి వెళ్లి అధ్యక్షుడిని పట్టుకొచ్చాడు.. మరి మీరు మన దేశాన్ని ముంచిన ఉగ్రవాదులను పాకిస్తాన్ నుంచి ఎందుకు లాక్కొని రలేకపోతున్నారు?" అంటూ ఆయన వేసిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై వేదికగా ఓవైసీ సంధించిన ఈ వ్యంగ్యాస్త్రాలు రాజకీయంగా పెను చర్చకు దారితీశాయి.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ, వెనిజులా ఉదంతాన్ని 26/11 ముంబై దాడులతో లింక్ చేస్తూ మోదీ సర్కార్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. "ట్రంప్ తన సైన్యాన్ని పంపి మదురోను పట్టుకోగలిగినప్పుడు.. మోదీ గారు మీరు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? పాకిస్తాన్‌లోకి మన ఆర్మీని పంపి, 26/11 దాడులకు కారణమైన మాస్టర్ మైండ్స్‌ను, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులను, ముఖ్యంగా మసూద్ అజార్ వంటి దుర్మార్గులను భారత్‌కు లాక్కొచ్చే ధైర్యం మీకు ఉందా?" అని సూటిగా ప్రశ్నించారు.
2008లో జరిగిన ముంబై దాడుల్లో 170 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ మారణహోమానికి కారణమైన వారు నేటికీ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. వారిని పట్టుకురావడంలో కేంద్రం విఫలమైందనే కోణంలో ఓవైసీ విమర్శలు గుప్పించారు.
అంతటితో ఆగకుండా, గతంలో ప్రధాని మోదీ అమెరికా వెళ్లినప్పుడు ఇచ్చిన "అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్" నినాదాన్ని ఓవైసీ గుర్తుచేశారు. "ట్రంప్ మీకు మిత్రుడే కదా.. ఆయన అంత డేరింగ్ స్టెప్ తీసుకున్నప్పుడు, మీరు ఆయనకంటే తక్కువేం కాదు కదా! ఆయన చేయగలిగితే మీరు కూడా చేసి చూపించాలి" అంటూ ఎద్దేవా చేశారు.
పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి ఉగ్రవాదులను ఏరిపారేయడం లేదా బంధించి తీసుకురావడం అనేది ప్రతి భారతీయుడు కోరుకునేదే. ఇప్పుడు ట్రంప్ చర్యను ఉదాహరణగా చూపిస్తూ, మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే ఓవైసీ వ్యూహంగా కనిపిస్తోంది.
जब @realDonaldTrump Venezuela से वहाँ के President Nicolas Maduro को उठा सकता है, तो @narendramodi 26/11 मुंबई हमलों के masterminds को Pakistan से क्यों नहीं उठाते? pic.twitter.com/ZGUJjpOQpR
— Asaduddin Owaisi (@asadowaisi) January 4, 2026
బాటమ్ లైన్ (విశ్లేషణ)..
ఓవైసీ వ్యాఖ్యలు వినడానికి ఆవేశంగా, ఆలోచింపజేసేలా ఉన్నా.. వాస్తవ పరిస్థితులు వేరు.
భౌగోళిక వ్యత్యాసం: వెనిజులా అమెరికాకు దగ్గరలో ఉన్న ఒక చిన్న దేశం, పైగా ఆర్థికంగా చితికిపోయింది. కానీ పాకిస్తాన్ అణు ఆయుధాలు కలిగిన దేశం. అమెరికా చర్యను భారత్ యథాతథంగా కాపీ కొడితే.. అది రెండు అణు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి (Full-scale Nuclear War) దారితీసే ప్రమాదం ఉంది.
రాజకీయ వ్యూహం: ఓవైసీ లాజిక్ సామాన్యుడిని ఆకర్షిస్తుంది. "మనం ఎందుకు చేయలేం?" అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతుంది. బీజేపీ తనను తాను 'బలమైన ప్రభుత్వం'గా చెప్పుకుంటుంది కాబట్టి, ఆ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ఓవైసీ ట్రంప్ ఉదంతాన్ని వాడుకుంటున్నారు.
ముంబై గాయం: 26/11 అనేది భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేని గాయం. ఆ నేరస్తులు పాక్‌లో దర్జాగా తిరుగుతుంటే మన రక్తం మరిగిపోవడం సహజం. ఓవైసీ సరిగ్గా ఆ ఎమోషన్‌నే టచ్ చేశారు.

