2026.. 'టెక్నాలజీ' నామ సంవత్సరం! ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదిక.. వాట్సాప్ లోనే సర్కార్ సేవలు

naveen
By -

ప్రభుత్వ ఆఫీసు అంటేనే చెప్పులు అరిగేలా తిరగాలి, దరఖాస్తులు ఇవ్వాలి, అది ఎప్పుడు కదులుతుందో తెలియక పడిగాపులు కాయాలి.. ఇదంతా గతం! ఇకపై పాలన స్మార్ట్ గా మారబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తన ట్రేడ్ మార్క్ టెక్నాలజీ అస్త్రాన్ని బయటకు తీశారు. 2026 సంవత్సరాన్ని 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్'గా ప్రకటించి అధికారులకు కొత్త టార్గెట్లు పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం నుంచి వాట్సాప్ లోనే సర్టిఫికెట్ల జారీ వరకు.. ఆయన తీసుకున్న నిర్ణయాలు పాలనలో ఎలాంటి విప్లవం తేబోతున్నాయి?  


CM Chandrababu declares 2026 as 'Technology Driven Decision Making Year' focusing on AI and WhatsApp services.


ఏఐతో సమస్యలకు చెక్.. మనిషి ప్రమేయం లేని పాలన

సోమవారం క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS)పై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత అనేది కేవలం సౌకర్యం కోసమే కాదు, పారదర్శకమైన పాలనకు అది ఒక ఆయుధం అని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధస్సు (AI) పాత్రను భారీగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఏఐ ద్వారా విశ్లేషించి, మానవ ప్రమేయం లేకుండానే పరిష్కరించేలా వ్యవస్థను రూపొందించాలన్నారు. దీనివల్ల అవినీతికి, ఆలస్యానికి ఆస్కారం ఉండదని, ప్రజలకు సేవలు వేగంగా అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పనితీరులో వెనుకబడిన ఉద్యోగులకు అధునాతన శిక్షణ ఇచ్చి, వారిని కూడా టెక్నాలజీ బాటలో నడిపించాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పారు.


డేటా లేక్.. గణాంకాలే గీటురాయి

కేవలం ఫైళ్లు కదపడమే పాలన కాదని, డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడమే (Data-Driven Decisions) నిజమైన గవర్నెన్స్ అని చంద్రబాబు ఉద్ఘాటించారు. వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ వంటి కీలక శాఖల డేటాను అనుసంధానించాలని సూచించారు. 'డేటా లేక్' (Data Lake) వ్యవస్థ ద్వారా సమాచారాన్ని విశ్లేషించి, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో గుర్తించి వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. ఊహాజనిత నిర్ణయాలు కాకుండా, పక్కా గణాంకాలతో ప్రభుత్వ యంత్రాంగం నడవాలని దిశానిర్దేశం చేశారు.


మన మిత్ర.. వాట్సాప్ లోనే సర్కార్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మన మిత్ర - వాట్సాప్ గవర్నెన్స్' ఫలితాల పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 1.43 కోట్ల మంది పౌరులు వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సేవలు పొందడం ఒక రికార్డు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల నుంచి మున్సిపల్ పన్నుల చెల్లింపు వరకు ఏకంగా 878 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. 2026 నాటికి ఏ పౌరుడు కూడా చిన్న చిన్న పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం రాకూడదని, అన్నీ డిజిటల్ గానే జరిగిపోవాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు.


అరచేతిలో ప్రభుత్వం! 

చంద్రబాబు విజన్ 2026 క్లియర్ గా ఉంది. ప్రభుత్వ ఆఫీసు గడప తొక్కకుండానే, స్మార్ట్ ఫోన్ ద్వారా పనులన్నీ అయిపోవాలి. ఇది అమలైతే పాలనలో నిజమైన పారదర్శకత వచ్చినట్లే.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!