టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి గడియారం ముల్లు వేగంగా తిరుగుతోంది. ఫిబ్రవరి 7న తొలి బంతి పడాల్సి ఉంది. కానీ మైదానం బయట జరుగుతున్న హైడ్రామా చూస్తుంటే టోర్నీ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఐసీసీకి గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ మంట పాకిస్తాన్ కు కూడా పాకింది. బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ కూడా వరల్డ్ కప్ ను బాయ్ కాట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇదే జరిగితే ఐసీసీకి, స్పాన్సరర్లకు చుక్కలు కనిపించడం ఖాయమని పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ (Basit Ali) హెచ్చరిస్తున్నారు. అసలు పాక్ ఆడకపోతే జరిగే నష్టమేంటి? పీసీబీ ఛైర్మన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి?
ఇండియా-పాక్ మ్యాచ్ లేకపోతే వేస్ట్
వరల్డ్ కప్ అంటేనే అందరి కళ్లు ఇండియా-పాకిస్తాన్ (India vs Pakistan) మ్యాచ్ పైనే ఉంటాయి. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయం, వ్యూయర్ షిప్ మొత్తం టోర్నీకే హైలైట్. అటువంటిది ఇప్పుడు పాకిస్తాన్ గనుక టోర్నీ నుంచి తప్పుకుంటే, స్పాన్సరర్లు రోడ్డున పడటం ఖాయమని బాసిత్ అలీ తేల్చిచెప్పారు. తన యూట్యూబ్ షోలో మాట్లాడుతూ, పాకిస్తాన్ లేని వరల్డ్ కప్ ను ఊహించుకోవడం కష్టమని, ఒకవేళ భారత్ వేరే ప్రత్యామ్నాయ జట్టుతో ఆడినా, దానికి దాయాది పోరుకు ఉన్నంత క్రేజ్ రాదని స్పష్టం చేశారు. స్పాన్సరర్లు పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పీసీబీ 'గవర్నమెంట్' అస్త్రం.. ఐసీసీకి చెమటలు
మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ వేసిన ఎత్తుగడను బాసిత్ అలీ ప్రశంసించారు. వరల్డ్ కప్ లో పాల్గొనే విషయంపై తాము నిర్ణయం తీసుకోలేమని, పాక్ ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తామని నఖ్వీ ప్రకటించడం వ్యూహాత్మకమేనని అన్నారు. ఈ ప్రకటనతో బంతి ఇప్పుడు ప్రభుత్వం కోర్టులో ఉండటంతో ఐసీసీ ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే పాక్ తప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఐసీసీ ఆంక్షలు విధించినా, తాము ప్రభుత్వ ఆదేశాలను పాటించాం అని చెప్పడానికి పీసీబీకి ఒక బలమైన కారణం దొరుకుతుంది.
బంగ్లాకు మద్దతు.. ఆంక్షల భయం
భద్రతా కారణాలతో భారత్ కు రావడానికి నిరాకరించిన బంగ్లాదేశ్ ను ఐసీసీ టోర్నీ నుంచి తొలగించింది. ఈ విషయంలో బంగ్లాదేశ్ కు సంఘీభావంగా పాకిస్తాన్ నిలబడటంలో తప్పులేదని బాసిత్ అలీ అభిప్రాయపడ్డారు. అయితే పాక్ జట్టు భారత్ లో ఆడాల్సిన అవసరం లేకపోయినా, టోర్నీని పూర్తిగా బాయ్ కాట్ చేయకూడదని సూచించారు. అలా చేస్తే ఐసీసీ నుంచి తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
డబ్బులొచ్చే మ్యాచ్ లేకపోతే ఎలా?
పాకిస్తాన్ ఆడటం కేవలం ఆ దేశానికే కాదు, ఐసీసీకి, స్పాన్సరర్లకు కూడా ఆర్థికంగా చాలా ముఖ్యం. దాయాది పోరు లేని వరల్డ్ కప్ అంటే, ఉప్పు లేని పప్పు లాంటిదే!

