అర్ధరాత్రి దద్దరిల్లిన వెనిజులా: ఆకాశం నుంచి నిప్పుల వాన.. ట్రంప్ 'గ్రౌండ్ అటాక్' మొదలైనట్టేనా?
దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో పరిస్థితులు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. రాజధాని కరాకస్ నగరం శనివారం తెల్లవారుజామున భారీ పేలుళ్లతో ఉలిక్కిపడింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఆకాశం నుంచి వినిపిస్తున్న యుద్ధ విమానాల భీకర శబ్దాలకు, భూమిని కంపించేలా చేసిన పేలుళ్లకు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
జనవరి 3న స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 2.15 గంటల వరకు ఈ పేలుళ్లు ఆగకుండా వినిపించాయని ఏఎఫ్‌పీ జర్నలిస్టులు ధ్రువీకరించారు. కచ్చితంగా ఏ ప్రాంతం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయో స్పష్టత లేనప్పటికీ, నగరంలోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ విధ్వంసం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది సాధారణ ఘటన కాదని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన హెచ్చరికల అమలులో భాగమేనని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. వెనిజులా కేంద్రంగా భారీ ఎత్తున మాదకద్రవ్యాల (Drugs) రవాణా జరుగుతోందని, దాన్ని అడ్డుకోవడానికి వెనిజులాపై భూతల దాడులు (Ground Attacks) తప్పవని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ పేలుళ్లు సంభవించడం గమనార్హం.
వెనిజులా పోర్టుల్లో డ్రగ్స్‌తో సిద్ధంగా ఉన్న పడవలను తాము ధ్వంసం చేశామని ట్రంప్ సోమవారం ప్రకటించారు. అయితే అది సైనిక చర్యనా లేక సీఐఏ ఆపరేషనా అనేది చెప్పడానికి ఆయన నిరాకరించారు. కేవలం తీరం వెంబడి ఆపరేషన్ జరిగిందని మాత్రమే చెప్పారు. వెనిజులా గడ్డపై జరిగిన మొట్టమొదటి భూతల దాడి ఇదేనని భావిస్తున్నారు.
కరేబియన్ సముద్రంలోకి ఇప్పటికే అమెరికా నేవీ దళాలు చేరుకున్నాయి. గగనతలాన్ని మూసివేయడం, చమురు ట్యాంకర్లను సీజ్ చేయడం వంటి చర్యలతో అమెరికా వెనిజులాపై ఉక్కుపాదం మోపుతోంది.
ఈ దాడుల వెనుక అసలు కారణంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఒక డ్రగ్ కార్టెల్ నాయకుడని, మాదకద్రవ్యాల మాఫియాను అంతం చేయడానికే తాము ఈ దాడులు చేస్తున్నామని అమెరికా వాదిస్తోంది. సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు జరిగిన 30 దాడుల్లో కనీసం 107 మంది స్మగ్లర్లను మట్టుబెట్టామని అమెరికా సైన్యం లెక్కలు చెబుతోంది.
కానీ, వెనిజులా అధ్యక్షుడు మదురో వాదన మరోలా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న తమ దేశంపై అమెరికా కన్ను పడిందని, ఆయిల్ కోసమే డ్రగ్స్ పేరు చెప్పి తన ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రంప్ చూస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. వాషింగ్టన్‌తో చర్చలకు సిద్ధమని చెప్పిన రెండు రోజులకే ఇలా రాజధాని నడిబొడ్డున బాంబుల మోత మోగడం వెనిజులా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది.
బాటమ్ లైన్..
ఇది కేవలం డ్రగ్స్ వేట కాదు.. స్పష్టమైన ఆధిపత్య పోరు. వెనిజులాలో జరుగుతున్నది 'వార్ ఆన్ డ్రగ్స్' ముసుగులో జరుగుతున్న 'వార్ ఫర్ ఆయిల్' అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ట్రంప్ మార్క్ రాజకీయం: 2026లో ట్రంప్ విదేశాంగ విధానం ఎంత అగ్రెసివ్‌గా ఉండబోతోందో వెనిజులా ఒక ఉదాహరణ మాత్రమే. అంతర్జాతీయ సరిహద్దులను దాటి, మరో దేశ రాజధానిపై దాడులు చేయడం ద్వారా అమెరికా తన పవర్ గేమ్ చూపిస్తోంది.
రుజువులేవి?: డ్రగ్ స్మగ్లర్లను చంపామని అమెరికా చెబుతున్నా, ఆ పడవల్లో డ్రగ్స్ ఉన్నాయనడానికి సరైన ఆధారాలను బయటపెట్టకపోవడం గమనార్హం. ఇది భవిష్యత్తులో మానవ హక్కుల ఉల్లంఘనగా మారే అవకాశం ఉంది.
సామాన్యుడికి నరకం: అగ్రరాజ్యాల రాజకీయ క్రీడలో వెనిజులా సామాన్యులు నలిగిపోతున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశం, ఇప్పుడు యుద్ధ భయంతో వణికిపోతోంది.

