దిల్లీ, ముంబై జనాలను చూసి "పాపం కాలుష్యంలో చస్తున్నారు" అనుకుని జాలిపడుతున్నారా? అయితే హైదరాబాద్ వాసులు కూడా కాలర్ ఎగరేయాల్సిన పనిలేదు. ఎందుకంటే దక్షిణాది మెట్రో నగరాల్లో మన నగరమే ఇప్పుడు 'పొల్యూషన్ కింగ్'గా మారింది. చెన్నై, బెంగళూరు కంటే మన గాలిలో విషం ఎక్కువట! ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పిన ప్రమాణాల కంటే రెట్టింపు కాలుష్యాన్ని మనం ప్రతిరోజూ పీలుస్తున్నాం. మరి ఈ స్లో పాయిజన్ ఎక్కడ ఎక్కువగా ఉంది? మీరు ఉంటున్న ఏరియా ఆ 'డేంజర్ లిస్ట్'లో ఉందా? పీసీబీ బయటపెట్టిన షాకింగ్ నిజాలు ఇవే.
డబుల్ డోస్.. ఊపిరితిత్తులకు ముప్పు
మనం పీల్చే గాలిలో దుమ్ము (PM10 - సూక్ష్మ ధూళికణాలు) ఎంత ఉండాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక ఘనపు మీటరుకు 40 మైక్రోగ్రాములు (ఎంజీ) దాటకూడదు. పోనీ మన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) లెక్కల ప్రకారం 60 ఎంజీ వరకు ఓకే అనుకుందాం. కానీ హైదరాబాద్ లో పరిస్థితి ఏంటో తెలుసా? ఏకంగా 82 నుంచి 88 ఎంజీల వరకు ఉంటోంది. అంటే ఉండాల్సిన దానికంటే రెట్టింపు కాలుష్యాన్ని మనం ఊపిరితిత్తుల్లోకి పంపుతున్నామన్నమాట. ఈ జనవరిలో అయితే ఇది గరిష్ఠంగా 105 ఎంజీ వరకు వెళ్ళిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దక్షిణాదిలో మనమే 'టాప్'
ఉత్తరాదితో పోలిస్తే మనం బెటరే అని సర్దిచెప్పుకోవడానికి లేదు. బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ గాలి నాణ్యత అధమ స్థాయి (Worst)లో ఉంది. గతంతో పోలిస్తే కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా, అది ఏమాత్రం సేఫ్ జోన్ కాదని గణాంకాలు మొత్తుకుంటున్నాయి. గతేడాది 365 రోజుల్లో ఒక్క రోజు.. అంటే ఒక్క రోజు కూడా 'స్వచ్ఛమైన గాలి' (Good Air Quality) నమోదు కాలేదంటే మనం ఎలాంటి వాతావరణంలో బతుకుతున్నామో ఆలోచించండి.
హైదరాబాద్‌లో 7 డేంజర్ స్పాట్స్
ఐఐటీ కాన్పూర్ అధ్యయనం ప్రకారం హైదరాబాద్ లో కాలుష్యం విపరీతంగా ఉన్న 7 హాట్‌స్పాట్లను పీసీబీ గుర్తించింది. మీరు కనుక ఈ రూట్లలో వెళ్తుంటే మాస్క్ మస్ట్ గా వాడాల్సిందే.
ఖైరతాబాద్ - కోఠి
జీడిమెట్ల (పారిశ్రామిక వాడ)
బీహెచ్‌ఈఎల్ - అమీర్‌పేట
నాంపల్లి - చార్మినార్
మెహిదీపట్నం - హైటెక్‌సిటీ - కూకట్‌పల్లి
సికింద్రాబాద్ - సైనిక్‌పురి
ఎల్‌బీనగర్ - కోఠి
మాస్క్ మస్ట్ గురూ!
మనం పీల్చేది గాలి కాదు, దుమ్ము! ప్రభుత్వం చర్యలు తీసుకునే దాకా ఆగకుండా, ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం మన ఆరోగ్యానికి మనమే ఇచ్చుకునే రక్షణ.

