ట్రంప్ 'టారిఫ్' వార్: క్యూబాకు ఆయిల్ అమ్మితే వాతే! కెనడాకు కూడా భారీ షాక్..

naveen
By -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తన 'టారిఫ్' అస్త్రాన్ని బయటకు తీశారు. "నా మాట వినకపోతే సుంకాల మోత మోగిస్తా" అంటూ మిత్ర, శత్రు దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఆయన టార్గెట్ క్యూబా (Cuba) మరియు కెనడా (Canada). క్యూబాకు చమురు అమ్మే దేశం ఏదైనా సరే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ కీలక ఉత్తర్వులపై సంతకం చేశారు. అంతేకాదు, పొరుగు దేశం కెనడాపై కూడా 50 శాతం టారిఫ్ కత్తి దూశారు. అసలు ట్రంప్ ఎందుకింత అగ్రెసివ్ గా వెళ్తున్నారు? మెక్సికో పరిస్థితి ఏంటి?


Donald Trump regarding tariffs on Cuba and Canada


క్యూబాపై ఆంక్షల కొరడా

క్యూబా విషయంలో ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితిని (National Emergency) ప్రకటించారు. క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొంటూ కొత్త ఉత్తర్వులపై సంతకం చేశారు. దీని ప్రకారం.. క్యూబాకు ఎవరు చమురు అమ్మినా వారిపై కఠినమైన టారిఫ్ లు విధిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ కఠిన నిబంధనలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.


మెక్సికోకు చెమటలు.. 'ఆయిల్' బంద్!

ట్రంప్ తాజా చర్య పరోక్షంగా మెక్సికో (Mexico)పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. క్యూబాకు చమురు ఎగుమతులు ఆపేయాలని ట్రంప్ మెక్సికోను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ స్పందిస్తూ.. క్యూబాకు చమురు రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇది అమెరికా భయంతో తీసుకున్న నిర్ణయం కాదని ఆమె కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ట్రంప్ 'టారిఫ్' భయమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.


కెనడాకు 50% షాక్!

మరోవైపు పొరుగు దేశం కెనడా (Canada)తో కూడా అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికాకు చెందిన 'గల్ఫ్‌స్ట్రీమ్‌ ఏరోస్పేస్‌' జెట్లకు సర్టిఫికెట్ ఇవ్వడానికి కెనడా నిరాకరించడంతో ట్రంప్ సీరియస్ అయ్యారు. వెంటనే ఈ తప్పును సరిదిద్దుకోకపోతే.. కెనడా నుంచి అమెరికాకు వచ్చే విమానాలపై ఏకంగా 50 శాతం టారిఫ్ (Trump Tariffs) విధిస్తానని 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు.


చైనాతో డీల్ కు చెక్?

ఇటీవలే కెనడా చైనాతో ట్రేడ్ డీల్ విషయంలో ముందుకెళ్తే.. ఆ దేశ దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విమానాల విషయంలోనూ అదే తరహాలో బెదిరింపులకు దిగడం గమనార్హం. అయితే కెనడా ప్రభుత్వం దీనిపై ఇంకా స్పందించలేదు.


ట్రేడ్ వార్ మొదలైంది! 

మొన్న చైనా.. నేడు క్యూబా, కెనడా! ట్రంప్ 'అమెరికా ఫస్ట్' నినాదం.. ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా పొరుగు దేశాలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది.