తెలంగాణ రాజకీయాల్లో బిగ్ బాంబ్ పేలింది. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) చిట్టచివరకు గులాబీ బాస్ ఇంటి తలుపు తట్టింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. ఈ పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది చట్టపరమైన విచారణ కాదని, పక్కా రాజకీయ కక్షసాధింపు చర్య అని ఫైర్ అయ్యారు. అసలు ఈ టైమ్ లోనే నోటీసులు ఎందుకు ఇచ్చారు? కవిత లేవనెత్తిన అనుమానాలేంటి?
ఇది విచారణ కాదు.. ప్రతీకారం!
కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా నిప్పులు చెరిగారు. తెలంగాణను సాధించి, పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన మహానాయకుడిని ఇబ్బంది పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆరోపించారు. "ఇది విచారణ కాదు.. ప్రతీకారం. ఇది న్యాయం కాదు.. రాజకీయ దురుద్దేశం" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏడాది గడిచినా వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..
ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డ్రామా ఆడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. "ప్రజల నోట్లో మట్టికొట్టి, ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య" అని పేర్కొన్నారు. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను, కేసీఆర్ స్థానాన్ని చెరిపేయలేరని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని, తాము ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
ఎన్నికల స్టంట్: కవిత
మరోవైపు ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) కూడా స్పందించారు. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి (మున్సిపల్ ఎన్నికలు) ఉన్న సమయంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం యాధృచ్చికం కాదని ఆమె ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది బాధాకరమైన విషయమే అయినా.. సిట్ విచారణ సీరియస్ గా సాగడం లేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. "విచారణను పూర్తి చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అనేది అర్థం కావడం లేదు. దోషులకు శిక్ష పడాల్సిందే కానీ, ఎన్నికల కోసమే ఈ నోటీసులు ఇచ్చినట్లుంది" అని ఆమె ఆక్షేపించారు.
రాజకీయ రణరంగంలో 'నోటీసుల' అస్త్రం!
ఎన్నికల వేళ కేసీఆర్ కు నోటీసులు రావడం కాంగ్రెస్ వ్యూహంలో భాగమా? లేక చట్టం తన పని తాను చేసుకుపోతోందా? ఏది ఏమైనా రానున్న రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీటెక్కడం ఖాయం.

