తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ విచారణ ముగిసిన వెంటనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుందని అనుకుంటే పొరపాటే. అసలు సినిమా ఇప్పుడే మొదలయ్యేలా కనిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు విషయంలో ప్రభుత్వం గేర్ మార్చింది. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేటీఆర్ ను సాక్షిగానే పిలిచామని చెబుతూనే, అసలు సూత్రధారుల భరతం పడతామని హెచ్చరించడం వెనుక ఆంతర్యం ఏంటి? పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నట్లు త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా నోటీసులు వెళ్లనున్నాయా?
రాజకీయ కక్ష కాదు.. ప్రజాస్వామ్య రక్షణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దిగజారుడు తనానికి తావులేదని స్పష్టం చేశారు. ప్రజాధనంతో నడిచే విజిలెన్స్ వ్యవస్థను సొంత అవసరాలకు వాడుకోవడం నేరమని, ఈ కేసులో పాత్రధారులు ఎవరో, అసలు కథ నడిపిన సూత్రధారులు ఎవరో కచ్చితంగా తేల్చుతామని మంత్రి హెచ్చరించారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని, తప్పు చేసిన వారికి శిక్ష పడటం ఖాయమని తేల్చిచెప్పారు.
సాక్షిగానే కేటీఆర్.. కానీ సూత్రధారులు ఎవరు?
కేటీఆర్ విచారణపై కూడా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని, అంటే ఆయన్ను ప్రస్తుతం సాక్షిగానే పరిగణిస్తున్నామని, ఇంకా నేరస్తుడిగా కాదని స్పష్టం చేశారు. సమాచారం కోసమే పిలిచామని చెబుతూనే, గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అరెస్టులను గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ ను అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారంపై కూడా మంత్రి స్పందించారు. ఆయన తప్పు చేయకపోతే అమెరికాకు ఎందుకు పారిపోయారని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తిరిగి వచ్చారని గుర్తుచేశారు.
బాధితుల జాబితాలో మాజీ గవర్నర్ కూడా?
ఫోన్ ట్యాపింగ్ భూతం ఎంతమందిని వెంటాడిందో మంత్రి జూపల్లి ఏకరువు పెట్టారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సైతం గతంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించిన విషయాన్ని గుర్తుచేశారు. అంతెందుకు, సాక్షాత్తు అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైందన్న ఆరోపణలు ఉన్నాయని వివరించారు. కేటీఆర్ సహా మరికొందరు తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యి ఉండొచ్చని ఒప్పుకున్నారని మంత్రి పేర్కొనడం గమనార్హం.
మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్ కు నోటీసులు?
రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ కేసు కీలకంగా మారబోతోంది. ఎన్నికల తర్వాత ఈ కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే అంశంపై వాడీవేడి చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ మెడకు చుట్టుకునేలాగే ఉంది.
ట్యాపింగ్ తీగ లాగితే.. డొంకంతా కదులుతోంది!
ఇది కేవలం అధికారుల విచారణతో ఆగిపోయేలా లేదు. రాజకీయ దిగ్గజాల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. వచ్చే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్లు తప్పవు.

