టీ20 వరల్డ్ కప్ చుట్టూ నడుస్తున్న హైడ్రామాకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్న పొలిటికల్ హీట్ క్రికెట్ గ్రౌండ్ ను తాకింది. సెక్యూరిటీ పేరుతో భారత్ లో అడుగుపెట్టేది లేదని భీష్మించుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) కు ఐసీసీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మాట వినని బంగ్లాదేశ్ ను ఏకంగా టోర్నీ నుంచే తప్పించేసింది. వారి స్థానంలో ఒక కొత్త జట్టుకు 'వైల్డ్ కార్డ్' ఎంట్రీ ఇచ్చింది. మరి బంగ్లాదేశ్ చేసిన తప్పేంటి? ఆ లక్కీ టీమ్ ఏది? ఈ నిర్ణయం వల్ల బంగ్లాకు జరిగే నష్టమేంటి?
మొండికేసిన బంగ్లా.. వేటు వేసిన ఐసీసీ
బంగ్లాదేశ్ లో హిందువుల హత్యల నేపథ్యంలో భారత్ లో నెలకొన్న పరిస్థితుల సాకుతో తమ ప్లేయర్స్ ను పంపలేమని బీసీబీ మొండికేసింది. భారత్ లో కాకుండా వేరే వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించాలని డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ నిరాకరించినా, బంగ్లాదేశ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు ఐసీసీలోని స్వతంత్ర వివాదాల పరిష్కార కమిటీ జోక్యం కావాలంటూ లేఖ రాసింది. కానీ ఐసీసీ ఈ డ్రామాను ఇక్కడితో కట్ చేసింది. బంగ్లాదేశ్ విజ్ఞప్తులను పక్కనపెట్టి, నిబంధనల ప్రకారం వారిని టోర్నీ నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ కు భారీ ఆర్థిక నష్టంతో పాటు, అంతర్జాతీయ వేదికపై పరువు నష్టం కూడా వాటిల్లింది.
స్కాట్లాండ్ కు జాక్ పాట్.. కోల్ కతాలో తొలి పోరు
బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కింది. క్వాలిఫయర్స్ లో ఇటలీ, నెదర్లాండ్స్ కంటే వెనుకబడ్డా.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెరుగ్గా ఉండటంతో స్కాట్లాండ్ కు ఈ అదృష్టం వరించింది. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లను ఓడించిన ట్రాక్ రికార్డ్ స్కాట్లాండ్ కు ఉంది. ఇప్పుడు గ్రూప్-సి లో విండీస్, ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్ జట్లతో కలిసి స్కాట్లాండ్ పోటీపడనుంది. ఫిబ్రవరి 7న కోల్ కతా వేదికగా వెస్టిండీస్ తో స్కాట్లాండ్ తమ తొలి సమరానికి సిద్ధమవుతోంది.
ఆటలో అలకలు పనిచేయవు!
రాజకీయాలను క్రీడలకు ఆపాదిస్తే నష్టపోయేది జట్టే అని బంగ్లాదేశ్ ఉదంతం స్పష్టం చేసింది. ఐసీసీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి డిమాండ్లు చేసే ఇతర దేశాలకు కూడా ఒక గట్టి హెచ్చరిక.

