Politics: చంద్రబాబుది డబుల్ గేమ్.. జగన్ ది స్వార్థం.. మధ్యలో జనం.. షర్మిల మాస్ ఎటాక్

naveen
By -

ఏపీ రాజకీయాల్లో 'రక్త సంబంధం' మరోసారి రచ్చకెక్కింది. సొంత అన్నపై చెల్లెలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్. "జగన్ కు అధికారం నప్పదు.. ఆయనలో స్వార్థం తగ్గేవరకు దేవుడు కూడా కరుణించడు" అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కేవలం విమర్శలతో సరిపెట్టకుండా.. ఫిబ్రవరి 2 నుంచి కొత్త యుద్ధానికి సిద్ధమయ్యారు. అసలు షర్మిల సడెన్ గా ఇంత అగ్రెసివ్ గా ఎందుకు మారారు? జగన్ ను టార్గెట్ చేస్తూనే కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఆమె ప్లాన్ ఏంటి? ఈ 'ఉపాధి' పోరాటం ఎందుకు ?


APCC Chief YS Sharmila


అబ్రహం లింకన్ సాక్షిగా.. జగన్ పై ఫైర్

విజయవాడ వేదికగా షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపి శ్రేణులను కలవరపెడుతున్నాయి. "మనిషి నైజం తెలియాలంటే అధికారం ఇచ్చి చూడాలి" అని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన మాటలను ఆమె గుర్తు చేశారు. జగన్ కు ఒక్కసారి అధికారం ఇస్తే రాష్ట్రం ఏమైందో అందరూ చూశారని ఎద్దేవా చేశారు.

  • మద్యం మాఫియా: సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి, కల్తీ మద్యాన్ని ఏరులై పారించారని ఆరోపించారు.

  • విధ్వంసం: రుషికొండను బోడిగుండు చేశారని, ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేశారని మండిపడ్డారు.

  • అందుబాటులో లేరు: సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకే దొరకని నాయకుడు ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు.


ఆ పాదయాత్ర ఎవరిని మోసం చేయడానికి?

ఇటీవల జగన్ ప్రకటించిన పాదయాత్రపైనా షర్మిల సెటైర్లు వేశారు. ఎన్నికలకు ముందు మాత్రమే 'సిద్ధం' అంటూ హడావిడి చేసే జగన్.. ఇన్నాళ్లు ప్రజల్లో ఎందుకు లేరని నిలదీశారు. ఏడాదిన్నర తర్వాత చేస్తానంటున్న యాత్ర కేవలం ప్రకటనలకే పరిమితమని, అది ప్రజలను మళ్ళీ మోసం చేయడానికేనని దుయ్యబట్టారు. దమ్ముంటే ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుంటే దానిపై పోరాడాలని సవాల్ విసిరారు.


ఫిబ్రవరి 2 నుంచి 'బండ్లపల్లి' పోరు

మాటలతో ఆగకుండా చేతల్లోకి దిగుతున్నారు షర్మిల. గ్రామీణ పేదల ఆకలి తీర్చే 'ఉపాధి హామీ పథకాన్ని' రక్షించుకునేందుకు "ఉపాధి హామీ రక్షణ యాత్ర"ను ప్రకటించారు.

  • ఎప్పుడు?: ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం.

  • ఎక్కడ?: అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గంలోని 'బండ్లపల్లి' (20 ఏళ్ల క్రితం ఇక్కడే యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది).

  • ఎందుకు?: కేంద్రం తెస్తున్న కొత్త బిల్లు (వీబీ జీ రామ్ జీ బిల్లు) వల్ల ఉపాధి నిధులు తగ్గే ప్రమాదం ఉంది.


కూటమి సర్కార్ ద్వంద్వ వైఖరి

ఈ యాత్ర ద్వారా షర్మిల ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒకపక్క జగన్ ను విమర్శిస్తూనే.. మరోపక్క చంద్రబాబు (Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఉపాధి హామీకి గండికొట్టే బిల్లుకు మద్దతిస్తూనే.. నిధులు ఇవ్వడం లేదని కేంద్రంపై ఫిర్యాదు చేయడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆమె విమర్శించారు.


ఇది కేవలం పొలిటికల్ ఫైట్ కాదు.. సర్వైవల్ ఫైట్! 

జగన్ సైలెంట్ గా ఉన్న గ్యాప్ లో.. షర్మిల ప్రతిపక్ష గొంతుకగా మారే ప్రయత్నం చేస్తున్నారు. 'ఉపాధి హామీ' అనేది కోట్లాది మంది పేదల జీవనాధారం. దాని చుట్టూ రాజకీయం చేయడం ద్వారా ఆమె గ్రామీణ ఓటర్లకు దగ్గరవ్వాలని చూస్తున్నారు.