పాకిస్థాన్‌లో ఆయిల్ జాక్‌పాట్: వెనిజులాను మించిన నిల్వలు, అమెరికా రిపోర్ట్!

naveen
By -

Oil drilling rig operation in Pakistan representing the discovery of massive oil reserves.

పాకిస్థాన్‌కు 'జాక్‌పాట్'.. వెనిజులాను మించిన చమురు నిల్వలు! దాయాది దేశం దశ తిరిగినట్టేనా?


అప్పుల కుప్పగా మారి, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌కు ఊహించని అదృష్టం వరించింది. "చిప్ప చేతిలో పట్టుకున్నోడికి అక్షయపాత్ర దొరికినట్లు".. పాక్ గడ్డపై ఏకంగా 'నల్ల బంగారం' (చమురు) నిక్షేపాలు బయటపడ్డాయి. అది కూడా ఏదో ఆషామాషీగా కాదు, ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న వెనిజులాను మించిపోయే స్థాయిలో ఈ నిల్వలు ఉన్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆవిష్కరణ పాకిస్థాన్ తలరాతను మార్చేయడమే కాదు, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలను కూడా మార్చే శక్తిని కలిగి ఉంది.


అమెరికా జియోలాజికల్ సర్వే తాజా ప్రకటన ప్రకారం.. పాకిస్థాన్‌లోని 'సులైమాన్ ఫోల్డ్-థ్రస్ట్ బెల్ట్' ప్రాంతంలో ఏకంగా 340 బిలియన్ బ్యారెళ్ల భారీ చమురు నిల్వలు ఉన్నట్లు తేలింది. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధికంగా వెనిజులాలో 303 బిలియన్ బ్యారెళ్ల నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు పాక్ దాన్ని అధిగమించింది. ఇండియా, యురేషియా టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన ఈ భౌగోళిక ప్రాంతం.. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూంఖ్వా రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌తో హఠాత్తుగా ఇంధన ఒప్పందం చేసుకోవడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనని ఇప్పుడు అర్థమవుతోంది. అగ్రరాజ్యానికి ఈ నిల్వల గురించి ముందే ఉప్పందిందని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఈ విషయాన్ని పాకిస్థాన్ కూడా నిర్ధారించింది. జనవరి 1న ఆ దేశ ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (OGDCL) ఒక కీలక ప్రకటన చేసింది. ఖోహాట్ జిల్లాలోని 'డట్టా ఫార్మేషన్'లో (జురాసిక్ కాలానికి చెందిన శిలాజ ప్రాంతం) చేపట్టిన తవ్వకాల్లో భారీగా చమురు, గ్యాస్ బయటపడ్డాయని తెలిపింది. 5,170 మీటర్ల లోతున జరిపిన డ్రిల్లింగ్ పరీక్షల్లో (Drill Stem Test).. ఒక బావి నుంచే రోజుకు 4,100 బ్యారెళ్ల చమురు, 10.5 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోందని వెల్లడించింది. ఇంధన దిగుమతుల కోసమే తన ఆదాయంలో సింహభాగం ఖర్చు చేస్తున్న పాకిస్థాన్‌కు ఇది నిజంగానే ఊపిరి పోసే వార్త. దేశీయంగా చమురు ఉత్పత్తి పెరిగితే.. పాక్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడే అవకాశం ఉంది.



బాటమ్ లైన్..


నిక్షేపాలు దొరకడం అదృష్టమే.. కానీ దాన్ని వెలికితీసి అమ్ముకునే సత్తా పాకిస్థాన్‌కు ఉందా? అన్నదే అసలైన ప్రశ్న.

  1. ట్రంప్ మాస్టర్ ప్లాన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాపారవేత్త. లాభం లేనిదే ఎవరితోనూ చేతులు కలపరు. వెనిజులాలో మదురో ప్రభుత్వం చమురును అమెరికాకు దక్కకుండా చేసింది. అందుకే ఇప్పుడు ట్రంప్ పాకిస్థాన్ వైపు చూస్తున్నారు. ఈ నిల్వలను వెలికితీయడానికి అమెరికా కంపెనీలే రంగంలోకి దిగుతాయి, సింహభాగం లాభాలు అక్కడికే వెళ్తాయి.

  2. అంతర్యుద్ధ ముప్పు: ఈ నిల్వలు ఉన్నది బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రాంతాల్లో. అక్కడ ఇప్పటికే వేర్పాటువాద ఉద్యమాలు, ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రంగా ఉన్నాయి. "మా వనరులు మాకే కావాలి" అని స్థానికులు తిరగబడితే.. ఈ సంపద పాకిస్థాన్‌కు వరమా? శాపమా? అనేది కాలమే నిర్ణయించాలి.

  3. భారత్‌పై ప్రభావం: పక్కదేశం ఆర్థికంగా బలపడితే మంచిదే.. కానీ ఆ డబ్బును అభివృద్ధికి వాడతారా? లేక ఆయుధాలకు వాడతారా? అన్నదే భారత్‌కు ఆందోళన కలిగించే అంశం.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!