అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక్క నిర్ణయం భారతీయ ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఆయన చేసిన ఒకే ఒక్క ప్రకటనతో దలాల్ స్ట్రీట్ లో క్షణాల్లోనే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇంతకీ ట్రంప్ చేసిన ఆ హెచ్చరిక ఏంటి? గ్రీన్‌లాండ్ వివాదం మన మార్కెట్‌ను ఎందుకు ముంచేసింది? ఈ పతనం వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు.
మంగళవారం భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ముగిసే సమయానికి భారీ పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,065 పాయింట్లు పతనమై 82,180 వద్ద ముగియగా, నిఫ్టీ 1.38 శాతం నష్టపోయి 25,232 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద అక్షరాలా రూ. 9.86 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోవడంతో సామాన్య మదుపరులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్లు కుప్పకూలడం మార్కెట్‌ను మరింత దెబ్బతీసింది.
గ్రీన్‌లాండ్ లొల్లి.. ట్రంప్ వార్నింగ్
ఈ భారీ పతనానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ దేశాలపై ప్రకటించిన వాణిజ్య యుద్ధమేనని చెప్పవచ్చు. గ్రీన్‌లాండ్‌పై పట్టు సాధించేందుకు ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా 8 యూరోపియన్ దేశాలపై కొత్తగా టారిఫ్‌లు (పన్నులు) విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఫ్రెంచ్ వైన్లపై ఏకంగా 200 శాతం పన్ను వేస్తామన్న ట్రంప్ ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లు వణికిపోయాయి. అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య యుద్ధం మొదలైతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టేస్తుందన్న భయంతో ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్ముకోవడానికి ఎగబడ్డారు.
సేఫ్ గేమ్.. బంగారం వైపు చూపు
మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపారు. దీంతో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకి 4,700 డాలర్ల రికార్డు స్థాయిని తాకింది. మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. మంగళవారం ఒక్కరోజే వారు రూ. 3,000 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా నష్టపోవడానికి ఇదే ప్రధాన కారణం.

