Ustaad Bhagat Singh Pre-Release: నాది ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం.. నా హీరో చిరంజీవి గారే అన్న పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్ర వేడుకలో పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ జర్నీ, సినిమా పట్ల తనకున్న ప్రేమ, అన్నయ్య చిరంజీవిపై ఉన్న అభిమానం గురించి ఎమోషనల్ గా మాట్లాడారు.
సినిమా తనకు ఎంతో ఇష్టమని, ఈరోజు తనకు అన్నం పెట్టి ప్రజలకు సేవ చేసే స్థాయికి చేర్చిందని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తన దృష్టిలో తెలుగు, తమిళ సినిమా అనే బేధం లేదని, అదంతా ఒకే భారతీయ సినిమా అని ఆయన గర్వంగా చెప్పారు. మన ఇండస్ట్రీ ఆస్కార్ స్థాయికి వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందన్న పవన్, తన వరకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారని ఉద్వేగంగా చెప్పారు. ఆయన పక్కన నిలబడితే తాను హీరోననే సంగతి కూడా మర్చిపోతానని, ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి చిరంజీవి గారు, రామ్ చరణ్ ట్వీట్ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
ఈ సినిమా జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని పవన్ గుర్తుచేసుకున్నారు. కథ అనుకున్న దగ్గరి నుంచి కోవిడ్ రావడం, ఆ తర్వాత తాను రాజకీయాల్లో బిజీ కావడం, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టడం వంటివి జరిగాయని వివరించారు. అయితే తన రాజకీయ విధులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా కేవలం నలభై నుంచి నలభై ఐదు రోజుల్లోనే తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశానని వెల్లడించారు. రోజుకు కేవలం ఐదారు గంటలు మాత్రమే పనిచేసినా, దర్శకుడు హరీష్ శంకర్ పక్కా ప్లానింగ్ వల్లే ఇది సాధ్యమైందని, తనకు మళ్లీ సినిమాలు చేయొచ్చు అనే భరోసాను ఈ చిత్రమే ఇచ్చిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఈ సినిమా అద్భుతంగా రావడానికి ప్రధాన కారణం దర్శకుడు హరీష్ శంకర్ అని పవన్ ప్రశంసించారు. అభిమానుల్లో నుంచి వచ్చిన ఒక వ్యక్తి దర్శకుడైతే ఆ తపన ఎలా ఉంటుందో హరీష్ శంకర్ వర్క్ లో కనిపిస్తుందని కొనియాడారు. పుష్ప, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు పెట్టిన కష్టాన్ని అభినందించారు. శ్రీలీల కెరీర్ లో ఈ పాత్ర గుర్తుండిపోతుందని, కథ వినకుండానే సినిమా ఒప్పుకున్న రాశి ఖన్నాకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సహా టెక్నీషియన్స్ అందరి పేర్లను ప్రత్యేకంగా గుర్తుచేసుకుని మరీ పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు.
అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడని, అభిమానులకు తనకు కేవలం రెండు గుండెల దూరం మాత్రమే ఉందని పవన్ ఎమోషనల్ అయ్యారు. ప్రజలను ప్రేమించడమే తన గోత్రం, వారికి సేవ చేయడమే తన నక్షత్రం అని ఆయన చెప్పిన డైలాగ్ ఈవెంట్ లో హైలైట్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సినిమాలకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తుందని, అందరు హీరోలు బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. మార్చి 19న ఉగాది కానుకగా రాబోతున్న ఈ సినిమా గబ్బర్ సింగ్ రేంజ్ లో విజయం సాధించాలని కోరుకుంటూ, ఈవెంట్ కు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.

