Ambati Rambabu Release: జైలు నుంచి విడుదల.. సంచలన వ్యాఖ్యలు

naveen
By -
Ambati Rambabu Release


రాజకీయాల్లో అరెస్టులు, జైలు జీవితాలు సహజమే. కానీ, ఒక మాజీ మంత్రి జైలు నుంచి బయటకు వస్తూ.. "నన్ను చంపడానికి చూశారు" అని సంచలన ఆరోపణలు చేస్తే? అది ఖచ్చితంగా పొలిటికల్ హీట్ ను పెంచే అంశమే. గత 18 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఎట్టకేలకు విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బుధవారం (ఫిబ్రవరి 18) గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. జైలు ద్వారాలు తెరుచుకుని బయటకు రాగానే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. అసలు అంబటిని టార్గెట్ చేశారా? జైలులో ఆయనకు ప్రాణహాని తలెత్తిందా?


వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిన అంబటి రాంబాబు మొత్తానికి ఊపిరి పీల్చుకున్నారు. జనవరి 31న సీఎం చంద్రబాబు నాయుడుపై (CM Chandrababu Naidu) అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో అరెస్ట్ అయిన అంబటి, ఆ తర్వాత పోలీసులపై దురుసు ప్రవర్తన (పట్టాభిపురం ఘటన), చివరగా 2023 నాటి సంక్రాంతి లక్కీ డ్రా కేసు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పీటీ వారెంట్లతో 18 రోజుల పాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది. 


అయితే, ఈ రోజు గుంటూరు కోర్టు లక్కీ డ్రా కేసులో కూడా బెయిల్ ఇవ్వడంతో ఆయనకు లైన్ క్లియర్ అయ్యింది. రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) నుంచి ఆయన బయటకు రాగానే వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.


జైలు నుంచి బయటకు వచ్చిన అంబటి.. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. "నన్ను జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నించారు. చంపడానికి కూడా చూశారు. కానీ నేను దేనికీ భయపడను. ఎన్ని రోజులైనా జైలులో ఉండటానికి సిద్ధపడే వెళ్లాను" అని స్పష్టం చేశారు. 


విచిత్రమేమిటంటే, ఆయన జైలు జీవితంపై పాజిటివ్ గా స్పందించారు. "నేను జైలులో బాధపడలేదు.. ఆ జీవితాన్ని ఎంజాయ్ చేశాను" అని వ్యాఖ్యానించడం కొసమెరుపు. బాధితులను జైళ్లో వేసి, నేరస్తులను వదిలేస్తున్నారని, తన ఇంటిపై దాడి చేసి కుటుంబాన్ని వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటికీ దేవుడే, కాలమే సమాధానం చెబుతుందని హెచ్చరించారు.


లక్కీ డ్రా ముగిసింది.. పొలిటికల్ వార్ మొదలైంది!

18 రోజుల జైలు జీవితం అంబటిని మానసికంగా కుంగదీయకపోగా, మరింత కసిని పెంచినట్లు కనిపిస్తోంది. "ఎంజాయ్ చేశా" అన్న మాట వెనుక.. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తానన్న సంకేతం స్పష్టంగా ఉంది. ఏపీ పాలిటిక్స్ లో డైలాగ్ వార్ మళ్లీ పీక్స్ కి చేరడం ఖాయం.