Assam Congress Drama: భూపేన్ బొరా రాజీనామా వెనక్కి?

naveen
By -
Assam Congress Drama


రాజకీయం అంటేనే క్షణక్షణం మారే రంగుల వినోదం. సరిగ్గా ఎన్నికల ముంగిట అసోం కాంగ్రెస్‌లో (Assam Congress) జరిగిన హైడ్రామా దీనికి నిలువెత్తు నిదర్శనం. ఉదయం నిద్రలేవగానే "నా ఆత్మగౌరవం దెబ్బతింది.. పార్టీకి గుడ్ బై" అంటూ సంచలన ప్రకటన చేసిన పీసీసీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బొరా (Bhupen Kumar Borah), సాయంత్రానికి మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. 32 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని చెప్పిన ఆయనే, కొన్ని గంటల్లోనే "ఒక్క రోజు టైమ్ ఇవ్వండి.. ఆలోచించుకుంటా" అనడం వెనుక ఏం జరిగింది? ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆ ఒక్క ఫోన్ కాల్ పని చేసిందా? అసోం కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది?


అసోం పీసీసీ చీఫ్ భూపేన్ కుమార్ బొరా సోమవారం ఉదయం తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీతో తనకున్న మూడు దశాబ్దాల బంధం నేటితో ముగిసిపోయిందని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


త్వరలోనే అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రధాన ప్రతిపక్షానికి సారథ్యం వహిస్తున్న నాయకుడే ఇలా మధ్యలో చేతులెత్తేయడం పార్టీ శ్రేణులను షాక్‌కు గురిచేసింది. అయితే ఈ షాక్ నుంచి పార్టీ కోలుకోకముందే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజీనామా ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే భూపేన్ బొరా.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గౌరవ్ గొగోయ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ జితేంద్ర సింగ్ తో భేటీ అయ్యారు.


ఈ సమావేశం అనంతరం బొరా మీడియాతో మాట్లాడుతూ తన స్వరాన్ని పూర్తిగా మార్చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న చాలా విషయాలు అధిష్ఠానానికి తెలియడం లేదని, దీని గురించి తాను వారికి లేఖ రాశానని చెప్పుకొచ్చారు. పార్టీ నాయకులు తనతో చర్చించారని, అందుకే తన రాజీనామా నిర్ణయంపై పునరాలోచించడానికి ఒక రోజు గడువు కోరానని వెల్లడించారు.


మంగళవారం ఉదయం మళ్లీ జితేంద్ర సింగ్‌ను కలిసి తన తుది నిర్ణయం చెబుతానని క్లారిటీ ఇచ్చారు. అంటే ఉదయం ఉన్నంత ఆవేశం సాయంత్రానికి తగ్గిందని స్పష్టమైంది. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ పెద్దల జోక్యమేనని తెలుస్తోంది.


ఈ మొత్తం వ్యవహారంపై జితేంద్ర సింగ్ చాలా కూల్ గా స్పందించారు. భూపేన్ బొరా చాలా సీనియర్ అని, ఏ కుటుంబంలోనైనా అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలు సహజమని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, వేరే పార్టీల మాదిరిగా నోరు మూసుకుని ఉండాల్సిన అవసరం లేదని, అలా ఉంటే ఈడీ, సీబీఐలు వస్తాయని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. 


ఇక ఎంపీ గౌరవ్ గొగోయ్ అయితే ఒకడుగు ముందుకేసి ఎమోషనల్ అయ్యారు. భూపేన్ బొరా పార్టీకి గొప్ప ఆస్తి అని, ఆయన రాజీనామాను హైకమాండ్ అంగీకరించదని తేల్చిచెప్పారు. ఏదైనా తప్పు జరిగి ఉంటే ఒక సోదరుడిగా తాను క్షమాపణ కోరుతున్నానని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ స్వయంగా బొరాతో ఫోన్లో మాట్లాడారని, సమస్య సద్దుమణిగిందని గొగోయ్ సంకేతాలు ఇచ్చారు.


బుజ్జగింపులు ఫలించాయి.. కానీ అసంతృప్తి ఆగిందా? 

రాహుల్ గాంధీ ఎంట్రీతో ప్రస్తుతానికి ముప్పు తప్పింది. కానీ ఎన్నికల వేళ పీసీసీ చీఫ్ స్థాయి నాయకుడే 'ఆత్మగౌరవం' అంటూ రోడ్డెక్కడం క్యాడర్ మోరల్ ను దెబ్బతీసే అంశమే.

Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!