తెలంగాణ అన్నదాతలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సన్న వడ్ల బోనస్ డబ్బులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన బకాయిలను క్లియర్ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మాట ఇచ్చినట్లే బోనస్ నిధులను విడుదల చేయడంతో రైతుల నిరీక్షణకు తెరపడింది. అసలు ఎంత మంది రైతులకు లబ్ధి చేకూరింది? ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసింది? క్వింటాల్ కు రైతు చేతికి ఎంత అందుతోంది?
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.17 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ నగదు జమ అయ్యింది. గత వానాకాలం (2025-26) సీజన్ లో ఎవరైతే సన్న వరి సాగు చేశారో, వారికి ఈ పెండింగ్ బకాయిలను పౌరసరఫరాల శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ విడతతో కలిపి ఇప్పటివరకు సన్న వడ్ల బోనస్ కోసం ప్రభుత్వం ఏకంగా రూ.1939.58 కోట్లను విడుదల చేసినట్లయింది.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో, సన్న బియ్యం సాగును ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రైతులకు పెద్ద ఊరటనిస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పర్యవేక్షణలో ఈ నిధుల పంపిణీ జరిగింది.
అసలు ఈ స్కీమ్ ఎందుకు అంత స్పెషల్ అంటే.. రైతుకు గిట్టుబాటు ధరను గణనీయంగా పెంచడమే. కేంద్ర ప్రభుత్వం గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాల్ కు రూ.2,389 కనీస మద్దతు ధర (MSP) ఇస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం దానికి అదనంగా రూ.500 బోనస్ గా ఇస్తోంది. అంటే రైతుకు ఒక క్వింటాల్ సన్న వడ్లకు ఏకంగా రూ.2,889 లభిస్తోంది.
రాష్ట్రంలో నీళ్లు పుష్కలంగా ఉండటం, దానికి తోడు ప్రభుత్వం ఈ రూ.500 అదనపు ప్రోత్సాహకం ఇస్తుండటంతో రైతులు సన్న రకాల సాగు వైపు భారీగా మొగ్గు చూపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, బకాయిలు లేకుండా చూడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాట నిలబెట్టుకున్నారు.. సాగు స్వరూపం మారుతోంది!
కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, రైతులను లాభసాటి పంటల వైపు మళ్లించడంలో ప్రభుత్వం సఫలమైంది. ఈ బోనస్ ఇలాగే కొనసాగితే.. తెలంగాణ త్వరలోనే దేశంలోనే 'సన్న బియ్యం హబ్' (Fine Rice Hub) గా మారడం ఖాయం. ఇది వినియోగదారులకు నాణ్యమైన బియ్యం, రైతులకు మంచి ధర.. రెండూ దొరికే విన్-విన్ సిట్యుయేషన్.

