Supreme Court Warning: పెళ్లికి ముందే శారీరక సంబంధమా?

naveen
By -
Supreme Court Warning


ప్రేమ, డేటింగ్, లివిన్ రిలేషన్ షిప్స్.. మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు మారుతున్నాయి. కానీ చట్టం, న్యాయస్థానాలు కొన్ని విషయాల్లో సంప్రదాయాన్నే ప్రామాణికంగా తీసుకుంటాయా? అవుననే సమాధానం ఇస్తోంది సుప్రీంకోర్టు (Supreme Court). "మావి పాతకాలపు ఆలోచనలే కావచ్చు.. కానీ పెళ్లికి ముందే అబ్బాయి, అమ్మాయి శారీరకంగా ఎలా దగ్గరవుతారు?" అంటూ అత్యున్నత న్యాయస్థానం వేసిన ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 


పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ దాఖలైన ఓ అత్యాచారం కేసులో.. సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత యువతకు ఒక గట్టి హెచ్చరికలా ఉన్నాయి. అసలు కోర్టు ఎందుకిలా స్పందించింది? ఆ జడ్జి ఏమన్నారు?


మ్యాట్రిమోనియల్ సైట్ (Matrimonial Site) పరిచయాలు ఎంత ప్రమాదకరమో చెప్పే ఒక కేసు ఇది. బాధిత మహిళ, నిందితుడు 2022లో ఆన్‌లైన్‌లో కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను దుబాయ్ తీసుకెళ్లి పలుసార్లు ఏకాంతంగా గడిపాడు. తీరా చూస్తే అతనికి అప్పటికే పెళ్లైందని, 2024లో పంజాబ్‌లో మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు గ్రహించింది. 


తనను శారీరకంగా వాడుకుని, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న (Justice B.V. Nagarathna), జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం విచారించింది.


ఈ విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. "పెళ్లికి ముందు యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ అపరిచితులే. అలాంటప్పుడు పెళ్లికి ముందే శారీరక సంబంధం ఎలా సాధ్యం? ఈ విషయంలో మావి పాతకాలపు ఆలోచనలే కావచ్చు. కానీ పెళ్లికి ముందు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు" అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మాటలు ప్రస్తుత సమాజంలో యువత ప్రవర్తనపై కోర్టు ఆందోళనను ప్రతిబింబిస్తున్నాయి.


బాధితురాలు దుబాయ్ వెళ్లడంపైనా కోర్టు సూటిగా ప్రశ్నించింది. "పెళ్లి చేసుకోవడమే ఆమె ప్రాధాన్యత అయినప్పుడు.. పెళ్లికి ముందే అతడితో కలిసి దుబాయ్ ఎందుకు వెళ్లారు? ఆమె అంత కఠినంగా ఉండి ఉంటే వెళ్లేవారు కాదు కదా" అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. 


పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత.. పెళ్లి జరగలేదన్న కారణంతో దానిని అత్యాచారంగా పరిగణించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసును మధ్యవర్తిత్వానికి (Mediation) పంపాలని సూచిస్తూ, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.


అమ్మాయిలూ.. అప్రమత్తత అవసరం! 

టెక్నాలజీ కలిపింది కదా అని హద్దులు దాటకండి. పెళ్లి అనే బంధం ముడిపడే వరకు.. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. సుప్రీం వ్యాఖ్యలు కేవలం ఆ ఒక్క కేసు కోసమే కాదు.. యావత్ యువతకు ఒక హెచ్చరిక.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!