రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి శత్రువు నేడు మిత్రుడు కావచ్చు.. కండువా మార్చిన నేత మళ్లీ సొంత గూటికే జై కొట్టవచ్చు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) ఎపిసోడ్ చూస్తే ఇదే అనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన.. అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. "బుల్లెట్ దిగిందా?" అంటూ ఆయన చేసిన ఒక్క డైలాగ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి అందని ద్రాక్షలా మారిన ఇస్నాపూర్ మున్సిపల్ పీఠం వెనుక జరిగిన హైడ్రామా ఏంటి? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎంట్రీతో సీన్ ఎలా రివర్స్ అయ్యింది?
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశంపై చర్చ జోరుగా సాగుతున్న వేళ, గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారశైలి సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఆయన, అనర్హత వేటు భయంతోనో లేక రాజకీయ వ్యూహంతోనో మళ్లీ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ ఖాతాలో వేశారు.
ఇక ఉత్కంఠగా మారిన ఇస్నాపూర్ (Isnapur) మున్సిపాలిటీలో అయితే ఆయన వేసిన స్కెచ్ కు కాంగ్రెస్ విలవిలలాడింది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటింగ్ ఎలా జరిగిందని అడగ్గా.. "బుల్లెట్ దిగిందా లేదా?" అంటూ మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన కాన్ఫిడెన్స్ ఏంటో చూపించాయి.
అసలు ఇస్నాపూర్ లో ఏం జరిగిందంటే.. అక్కడ మొత్తం 26 వార్డులు ఉన్నాయి. ఫలితాల తర్వాత కాంగ్రెస్ బలం 13 (10 గెలుపు + 3 ఇండిపెండెంట్లు), బీఆర్ఎస్ బలం 13 (12 గెలుపు + 1 ఇండిపెండెంట్)గా సమంగా మారాయి. దీంతో మున్సిపల్ ఛైర్మన్ పీఠం ఎవరిదనే టెన్షన్ నెలకొంది.
తమదే విజయం అని కాంగ్రెస్ ధీమాగా ఉన్న సమయంలో బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో వచ్చిన ఆయన.. తన ఎక్స్ అఫీషియో ఓటును బీఆర్ఎస్ కు అనుకూలంగా వేశారు. దీంతో బీఆర్ఎస్ బలం పెరిగి ఇస్నాపూర్ పీఠం కారు ఖాతాలో పడింది.
ఈ వ్యూహాత్మక ఓటింగ్ తో ఇస్నాపూర్ మున్సిపల్ ఛైర్మన్‌గా మోటే సుమలత, వైస్ ఛైర్మన్‌గా పట్లోళ్ల మాధవి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నా.. అంతరాత్మ మాత్రం గులాబీ వైపే ఉందని మహిపాల్ రెడ్డి ఈ ఎన్నికలతో నిరూపించారు. అటు ఫిరాయింపుల చట్టం భయం, ఇటు లోకల్ పాలిటిక్స్ కలగలిపి మహిపాల్ రెడ్డి ఆడిన ఈ ఆటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఝలక్ తగిలిందనే చెప్పాలి.
కండువా ఏదైనా.. కథ నడిపింది 'కారు' సారథే!
మహిపాల్ రెడ్డి యూటర్న్, రఘునందన్ రావు సపోర్ట్.. పటాన్ చెరు పాలిటిక్స్ లో కొత్త ఈక్వేషన్స్ కు తెరలేపాయి.

