ఆఫీస్‌కు వెళ్లడానికి మెట్రోలో రయ్‌మని వెళ్తాం.. కానీ స్టేషన్ దిగాక ఆఫీస్‌కు లేదా ఇంటికి వెళ్లాలంటే ఆటో వాళ్లు అడిగినంత ఇచ్చుకోవాలి, లేదంటే ట్రాఫిక్ నరకం చూడాలి. సగటు హైదరాబాద్ ప్రయాణికుడికి నిత్యం ఎదురయ్యే ఈ లాస్ట్-మైల్ కనెక్టివిటీ కష్టాలకు ఇక చెక్ పడబోతోంది. మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అత్యాధునిక 'పాడ్ ట్యాక్సీలు' (Pod Taxis) రాబోతున్నాయి. అసలు డ్రైవర్ లేకుండా, కాలుష్యం లేకుండా గాల్లో వెళ్లే ఈ ట్యాక్సీలతో సామాన్యుడి జేబుకు, సమయానికి ఎంత లాభం చేకూరనుందో తెలుసా?
డ్రైవర్ ఉండడు.. ట్రాఫిక్ జామ్ అస్సలు ఉండదు!
హైదరాబాద్‌లో రోజూ దాదాపు 5 లక్షల మంది మెట్రో రైళ్లను వినియోగిస్తున్నారు. వీరికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు 'పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్' (PRT) పేరుతో ప్రభుత్వం ఈ పాడ్ ట్యాక్సీలను తీసుకురానుంది.
ఎలివేటెడ్ ట్రాక్‌లపై (పిల్లర్ల మీద) నడిచే ఈ ట్యాక్సీలకు డ్రైవర్ ఉండడు, పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థతో పనిచేస్తాయి. గంటకు గరిష్ఠంగా 40 కి.మీ. వేగంతో ప్రయాణించే ఒక్కో ట్యాక్సీలో 6 నుంచి 8 మంది ప్రయాణించవచ్చు. బ్యాటరీ లేదా విద్యుత్‌తో నడిచే ఈ వాహనాలతో ఎలాంటి కాలుష్యం ఉండదు.
ఏయే రూట్లలో రాబోతున్నాయంటే?
ముందుగా ఐటీ కారిడార్‌తో పాటు రద్దీగా ఉండే ప్రాంతాలపై సర్కార్ ఫోకస్ పెట్టింది. రాయదుర్గం-కూకట్‌పల్లి, రాయదుర్గం-హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే.. మీరు మెట్రో స్టేషన్‌లో దిగడానికి ముందే యాప్ ద్వారా పాడ్ ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చు. స్టేషన్ దిగగానే రోడ్డు మీదకు రాకుండా నేరుగా ట్యాక్సీ ఎక్కి ఆఫీస్‌లో వాలిపోవచ్చు. దీని ద్వారా గంటకు 10 వేల మందిని చేరవేసే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంటుంది.
టెండర్ల ప్రక్రియ షురూ..
ఈ వినూత్న ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో చేపట్టనున్నారు. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (DBFOT) విధానంలో దీన్ని నిర్మించనున్నారు.
దీనికి సంబంధించి సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కన్సల్టెంట్‌ను ఎంపిక చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) తాజాగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ముంబైలో ఇప్పటికే పట్టాలెక్కుతున్న ఈ తరహా ట్యాక్సీలు త్వరలోనే భాగ్యనగర వాసులకు అందుబాటులోకి రానున్నాయి.
ఆటో మాఫియాకు చెక్.. కాలుష్యానికి బ్రేక్!
మెట్రో వచ్చాక సిటీలో ట్రాఫిక్ కొంత తగ్గినా, లాస్ట్-మైల్ కనెక్టివిటీ లేక జనం ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ పాడ్ ట్యాక్సీలు సక్సెస్ అయితే, ఆటో డ్రైవర్ల ఇష్టారాజ్యానికి బ్రేక్ పడటమే కాకుండా, నగరంలో కాలుష్యం భారీగా తగ్గుతుంది. భవిష్యత్తులో ఈ వ్యవస్థను ఎంఎంటీఎస్, బస్ స్టాండ్లకు కూడా అనుసంధానిస్తే హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ విశ్వనగర స్థాయికి చేరడం ఖాయం!

