India-US Trade Deal: సామాన్యుడికి గుడ్ న్యూస్.. ధరలు తగ్గుతున్నాయ్! 500 బిలియన్ డాలర్ల స్కెచ్ ఇదే
భారత్, అమెరికా బంధం కేవలం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడానికే పరిమితం కాలేదు.. ఇప్పుడు బిజినెస్ లోనూ పార్ట్నర్స్ అయ్యాయి. మీ జేబుకు చిల్లు పడకుండా, మార్కెట్లో వస్తువుల ధరలు తగ్గేలా ఇరు దేశాలు ఒక భారీ 'మధ్యంతర వాణిజ్య ఒప్పందం' (India-US Trade Deal) చేసుకున్నాయి. అమెరికా తన పన్నులను భారీగా తగ్గించింది. బదులుగా భారత్ కూడా కొన్ని ఆఫర్లు ఇచ్చింది. అసలు ఈ డీల్ వల్ల సామాన్యుడికి, వ్యాపారికి కలిగే లాభమేంటి? 500 బిలియన్ డాలర్ల కొనుగోలు వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి?
సుంకాల భారం తగ్గింది.. ఎగుమతులకు రెక్కలొచ్చాయి!
మన దేశం నుంచి అమెరికా వెళ్లే వస్తువులపై ఇకపై పన్నుల మోత ఉండదు. ఈ ఒప్పందంలో భాగంగా భారత వస్తువులపై అమెరికా తన సుంకాలను (Tariffs) 18 శాతానికి తగ్గించింది. అంతేకాదు, గతంలో వేసిన అదనపు 25 శాతం పన్నును కూడా రద్దు చేసింది. దీనివల్ల మన టెక్స్‌టైల్స్, దుస్తులు, లెదర్, పాదరక్షలు, హస్తకళల ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో చౌకగా లభిస్తాయి. తద్వారా మన ఎగుమతులు పెరిగి, ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
అమెరికా 'డ్రై ఫ్రూట్స్' ఇక చౌక..
మనం ఇచ్చింది తక్కువేం కాదు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్, నట్స్ (Nuts), పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్ వంటి వాటిపై భారత్ సుంకాలను తగ్గించనుంది. అంటే ఇకపై సూపర్ మార్కెట్లలో విదేశీ పండ్లు, వైన్, డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే అమెరికా వైద్య పరికరాలు (Medical Devices) మన ఆసుపత్రులకు ఈజీగా చేరతాయి. ఐటీ గూడ్స్ కు సంబంధించిన లైసెన్సింగ్ తలనొప్పులను కూడా భారత్ రద్దు చేయనుంది.
500 బిలియన్ డాలర్ల డీల్.. ఫ్యూచర్ ప్లాన్!
ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే ఐదేళ్లలో భారత్ అమెరికా నుంచి ఏకంగా 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనబోతోంది. ఇందులో మనకు అత్యవసరమైన ఇంధనం (Energy), విమానాలు, టెక్నాలజీ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ డీల్ సజావుగా సాగితే.. భవిష్యత్తులో మన జనరిక్ మందులు, వజ్రాలపై కూడా అమెరికా పన్నులు ఎత్తివేస్తుంది. ఇదే జరిగితే ఫార్మా రంగానికి పండగే.
నాన్-టారిఫ్ అడ్డంకులు తొలగాయి
కేవలం పన్నులే కాదు.. వాణిజ్యానికి అడ్డుపడే ఇతర నిబంధనలను (Non-Tariff Barriers) కూడా ఇరు దేశాలు పరిష్కరించుకున్నాయి. దీనివల్ల వ్యాపారం స్మూత్ గా సాగుతుంది. పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం (BTA) దిశగా ఇది తొలి అడుగు మాత్రమే.
వినియోగదారుడికి పండగే!
ధరలు తగ్గుతాయి, క్వాలిటీ పెరుగుతుంది. దేశీయ పరిశ్రమలకు పోటీ పెరిగినా.. అంతిమంగా వినియోగదారుడికి, ఆర్థిక వ్యవస్థకు ఈ ఒప్పందం బూస్ట్ ఇస్తుంది.

